అమానుషం: బతికున్న శిశువును అట్టపెట్టెలో పెట్టి శ్మశానంలో..

by srinivas |   ( Updated:2021-07-12 03:57:38.0  )
అమానుషం: బతికున్న శిశువును అట్టపెట్టెలో పెట్టి శ్మశానంలో..
X

దిశ, ఏపీ బ్యూరో: తల్లి పొత్తిళ్లలో సేద తీరాల్సిన శిశువు రోడ్డుపాలైంది. ఆ కన్నతల్లికి ఏ కష్టమెుచ్చిందో లేక అసలు బిడ్డనే వద్దనుకుందో తెలియదుకానీ ముక్కుపచ్చలారని ఆ పసికందును సజీవంగా ఓ అట్టపెట్టెలో పెట్టి శ్మశాన వాటికలో వదిలేసి వెళ్లిపోయింది. భూమిపై పడిన నాలుగు రోజులకే ఆ పసికందును కన్నప్రేమకు నోచుకోకుండా చేసింది. ఆ చిన్నారి ఏడుపు ఆ తల్లి మాతృహృదయాన్ని కదిలించలేకపోయినా శ్మశాన వాటిక వద్ద ఉన్న ఓ వ్యక్తిని కదిలించింది. ఆకలితో గుక్కపెట్టి ఏడుస్తున్న చిన్నారిని చూసిన ఆ వ్యక్తి పిల్లలు లేని దంపతులకు అప్పగించాడు. బక్కచిక్కిన ఆ పసికందును కన్న తల్లి వదిలించుకోవాలని చూస్తే ఏ సంబంధం లేని ఆ దంపతులు చిన్నారిని కాపాడుకునేందుకు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ అమానుష ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కోటిలింగాల రేవ శ్మశాన వాటిక వద్ద జరిగింది.

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు 108 నియోనేటల్‌ అంబులెన్స్‌ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం రాజమహేంద్రవరం కోటిలింగాల రేవు శ్మశానవాటిక వద్ద బతికున్న చిన్నారిని అట్టపెట్టెలో పెట్టి వదిలేశారు. ఆ బాక్స్‌లో ఉన్న పసికందు ఆకలితో గుక్కపెట్టి ఏడుస్తుండటాన్ని ఆ పక్కనే ఉన్న శివ అనే ఓ వ్యాన్ డ్రైవర్ గమనించాడు. అట్టపెట్టెలో ఉన్న శిశువును చూశాడు. స్థానిక మల్లికార్జున నగర్‌కు చెందిన తుంపాటి వెంకటేష్, దేవి దంపతులకు చెప్పడంతో వారు ఆ పసిబిడ్డను అక్కున చేర్చుకున్నారు. ఆ చిన్నారి అనారోగ్యంగా ఉండటంతో తొలుత ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు అయినా నీరసంగా ఉండటంతో రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలోని ప్రత్యేక చిన్న పిల్లల సంరక్షణ యూనిట్‌కు తీసుకువెళ్లారు.

అయితే శిశువు కోలుకోలేకపోవడంతో కొవ్వూరులోని 108 నియోనేటల్‌ అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. ఆ అంబులెన్స్‌ ఈఎంటీ శాంతకుమార్, పైలట్‌ బుల్లిరాజు వెంటనే అక్కడకు చేరుకుని అత్యవసర వైద్యం అందించారు. మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రిలోని నియోనేటల్‌ ఇంటెన్సివ్‌‌కేర్‌ యూనిట్‌కు తరలించారు. పసికందును అలా బాక్సులో పెట్టి శ్మశాన వాటిక వద్ద వదిలేయడం చూసిన స్థానికులు కంటతడిపెట్టుకున్నారు. చిన్నారి బరువు 750 గ్రాములు మాత్రమే ఉందని, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఐసీడీఎస్ పీడీ జీవీ సత్యవాణి మీడియాకు తెలియజేశారు. ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ఉన్న ఆ పసికందును వెంకటేశ్, దేవి దంపతులు చూసుకుంటున్నారు. ఆ పసికందు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు. తమకు సంతానం లేకపోవడంతో ఆ దేవుడే ఈ బిడ్డను ప్రసాదించాడని తాము భావిస్తామని వెంకటేశ్ దంపతులు చెప్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed