హుజురాబాద్‌లో అత్యంత విచిత్రంగా ఆ రెండు పార్టీల పరిస్థితి..

by Sridhar Babu |   ( Updated:2021-07-29 03:31:39.0  )
హుజురాబాద్‌లో అత్యంత విచిత్రంగా ఆ రెండు పార్టీల పరిస్థితి..
X

దిశ ప్రతినిది, కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో రెండు పార్టీలు అత్యంత విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. సమరంలోకి దిగేందుకు శత్రువు దాడి చేస్తే నిలువరించేందుకు డాలు సిద్దంగా ఉన్న శత్రువును మట్టుబెట్టేందుకు అవసరమైన కత్తులు మాత్రం అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో ప్రధాన పార్టీలు ఇప్పుడు డాలు పట్టుకుని కత్తి కోసం తిరుగుతున్న దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి.

కొనసాగుతున్న అన్వేషణ..

ఈటల పార్టీని వీడడం ఖాయం అయిపోయినప్పటి నుండి అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోసం అన్వేషణ కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికి 10 మందికి పైగా పేర్లు తెరపైకి వచ్చాయి. అయినప్పటికీ అభ్యర్థి ఫైనల్ కాలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా హుజురాబాద్ అభ్యర్థి కోసం కసరత్తులు చేస్తున్నా ఫలితం లేకుండా పోయింది. మరో వైపున ఇతర పార్టీల్లో ఉన్న నాయకులను, ఇటు సొంత పార్టీకి చెందిన ఈటల వర్గాన్ని టీఆర్ఎస్ లో జాయిన్ చేసుకునే పనిలో నిమగ్నం అయ్యారు. కాని అభ్యర్థి విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ బలాన్ని పెంచేందుకు వీఐపీలంతా కూడా హుజురాబాద్ లోని ఐదు మండలాల్లోనే పర్యటిస్తున్నారు.

నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను చుట్టి వస్తూ పార్టీ సెకండ్ కేడర్ బలాన్ని కాపాడుకుంటున్నప్పటికీ అభ్యర్థి మాత్రం లేకుండా పోవడం టీఆర్ఎస్ పార్టీకి మైనస్ గా మారింది. రోజుకో అభ్యర్థి పేరును పరిశీలిస్తున్నప్పటికీ అధినేత కేసీఆర్ మదిలో ఎవరి పేరు ఉందో కూడా మిగతా నాయకులకు అంతు చిక్కడం లేదు. దీంతో పార్టీ నాయకులు కూడా గ్రౌండ్ లెవల్లో టీఆర్ఎస్ పార్టీ గురించే ప్రచారం చేసుకుంటూ పోతున్నారు తప్ప అభ్యర్థి గురించి చెప్పలేకపోతున్నారు.

కాంగ్రెస్ దీ అదే పరిస్థితి..

ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత హుజురాబాద్ ఎన్నికలు రసకందాయకంలో పడతాయని భావించారు. అయితే ఇక్కడ సరైన అభ్యర్థి లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టమే. హుజురాబాద్ ఇంఛార్జిగా మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ రంగంలోకి దిగారు. నియోజకవర్గం అంతా పర్యటించి పార్టీ కేడర్ తో సమావేశాలు జరుపుతున్నారు. ఇప్పటి వరకు హుజురాబాద్ లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే గట్టిపోటి ఉంటుందని భావిచినప్పటికీ దామోదర ఎంట్రీతో త్రిముఖ పోటీ అవుతుందని భావిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థి ఎవరో తేల్చలేకపోతోంది. ఇక్కడి నుండి గత ఎన్నికల్లో పోటీ చేసిన కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరడంతో కాంగ్రెస్ నాయకత్వం కూడా అభ్యర్థి కోసం వేట మొదలు పెట్టింది.

హుజురాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కార్యచరణ తయారు చేసుకుని కార్యరంగంలోకి దిగినా.. క్యాండెట్ ను తేల్చలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడం చూస్తుంటే యుద్దం చేసేందుకు డాలు అయితే ఉంది కానీ కత్తి లేకుండా పోవడం అత్యంత విచిత్రమంగా మారింది.

Advertisement

Next Story