ఆఫర్లున్నా… మెట్రో వద్దన్నా..!

by Anukaran |
ఆఫర్లున్నా… మెట్రో వద్దన్నా..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : మెట్రో ప్రయాణం మొరాయిస్తోంది.. లాక్డౌన్ ఎఫెక్ట్కు ట్రైన్లూ స్లో అయ్యాయి.. నిమిషాల వ్యవధిలోనే వాయువేగంతో దూసుకెళ్లే రైలు ఇప్పుడు నత్తనడకన సాగుతున్నాయి. లాక్డౌన్కు ముందు కిక్కిరిసిన జనాలు, జాతరను తలపించే స్టేషన్లు కనిపించిన మహా నగరం ఇప్పుడు బోసిపోయి కనిపిస్తున్నది.. ప్రయాణికుల రద్దీ పూర్తిగా తగ్గడంతో సంస్థ ఆఫర్లు సైతం ప్రకటించినా అనుకున్న స్థాయిలో ఆదరణ లేక బోగీలన్నీ వెలవెల బోతున్నాయి. ఐటీ ఉద్యోగులు ఇంటికే పరిమితం కావడం, కరోనా రెండో స్టేజ్ అంటూ ప్రచారం జరగుతుండడంతో ప్యాసింజర్లు జంకుతున్నారనేది మెట్రో యాజమాన్యం అభిప్రాయం.

రాయితీలు ప్రకటించినా.. ప్రచారాన్ని కల్పించినా… ప్రయాణికులు మెట్రో రైలు వైపు మొగ్గు చూపడంలేదు. మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య పెరగడంలేదు. అలా అని పూర్తిగా తగ్గడం లేదు. లాక్ డౌన్ అనంతరం మెట్రోలో రాకపోకలు సాగించే ప్రయాణికుల్లో పెను మార్పులు వచ్చాయి. ఏసీ ఉంటుందని, జనాలు అధికంగా ఉంటారని మెట్రో రైలుపై ఆసక్తి చూపడంలేదని ప్రయాణికులు వెల్లడిస్తున్నారు. ప్రధానంగా వ్యక్తిగత వాహనాల్లోనే ప్రయాణించేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రస్తుతం కరోనా రెండో దశ ప్రారంభమైంది. వైరస్ విభిన్న రూపాల్లో వస్తుందని ప్రచారం జరుగుతుండటంతో నగర వాసులు మెట్రోకు దూరంగా ఉంటున్నారు. పైగా, ప్రైవేట్ సంస్థలు ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రం హోం’ సదుపాయాలు కల్పించడంతో ఇంటికే పరిమితమయ్యారు. ముఖ్యంగా ఐటీ కారిడార్ లో పనిచేసే వారి సంఖ్య నగరంలో సుమారు 12.50 లక్షలు ఉంటుంది. వారే అధికంగా మెట్రోను వినియోగించేవారు, ప్రస్తుతం వారు పని ఇంటికే పరిమితం అవడంతో రద్దీ తక్కువగా ఉంది.

ప్రకటించిన రాయితీలు…

లాక్డౌన్ అనంతరం మెట్రో ఉ.7 గం.ల నుంచి రా. 9.30 గం.ల మధ్య మూడు మార్గాల్లో (నాగోల్ – రాయదుర్గం, మియాపూర్ – ఎల్బీ నగర్, జేబీఎస్- ఎంజీబీఎస్) రాకపోకలు సాగిస్తున్నాయి. 72 కి.మీ.ల దూరంలో 60 స్టేషన్లున్నాయి. ఎల్‌బీ నగర్- మియాపూర్ 29 కి.మీ.లు 27 స్టేషన్లు, నాగోల్ – రాయదుర్గం 28 కి.మీ.లు 23 స్టేషన్లు. జేబీఎస్ – ఎంజీబీఎస్ 11 కి.మీ.లు 10 స్టేషన్లు ఉన్నాయి. ప్రయాణికుల సేఫ్ కోసం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నామంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నా ప్రయాణికుల సంఖ్య పెరగడం లేదు. దీంతో కొత్త ప్రణాళికా రచనలో భాగంగా స్మార్ట్ కార్డుదారులకు క్యాష్ బ్యాక్ రీచార్జ్, ట్రిప్పులకు అనుగుణంగా స్కీంలు, రాయితీలను ప్రకటిస్తున్నది. అక్టోబర్ 17 నుంచి జనవరి వరకు, నవంబర్ 1 నుంచి జనవరి 16 వరకు ప్రత్యేక ఆఫర్‌లను తీసుకొచ్చింది. అయినా ప్రజలు మెట్రోను అంతగా పట్టించుకోవడంలేదు. ఆటోలు, ప్రైవేట్ వాహనాల్లో వెళ్లే వారు మాత్రమే మెట్రో వైపు చూస్తున్నారు. దీంతో మెట్రో ట్రిప్పులను నియంత్రిస్తున్నది.

తగ్గిన ప్రయాణికులు..

లాక్ డౌన్ కు ముందు మూడు మెట్రో కారిడార్లలో 50 రైళ్లు రోజుకు కనీసంగా 700 ట్రిప్పులు నడిచాయి. ప్రయాణికుల రద్దీని పరిగణలోకి తీసుకుని ట్రిప్పులను పెంచడం, తగ్గించడం చేసేవారు. ప్రయాణికుల సంఖ్య రోజుకు 4 లక్షల నుంచి 4.90 లక్షలకు చేరుకుంది. సరాసరి 4.30 లక్షలని అధికారుల అంచనా. ప్రస్తుతం రోజుకు కేవలం 30 రైళ్లు మాత్రమే తిరుగుతున్నాయని, ప్రయాణికుల సంఖ్య లక్షన్నరకు మించడం లేదని వెల్లడిస్తున్నారు.

మెట్రో ముఖ్య ఉద్దేశ్యం…

మెట్రో రైలు రంగంలో హెచ్‌ఎంఆర్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) ప్రాజెక్ట్. ఈ పథకం రూ. 16,511 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకుంది. ఇది పట్టణ విస్తరణతో పాటుగా వచ్చే మాస్ రాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (ఎంఆర్‌టీఎస్). ఇంటర్-మోడల్ కనెక్టివిటీ, సౌకర్యవంతమైన స్కై వే నడకలతో కూడిన సమగ్ర పట్టణ రవాణా ప్రాజెక్ట్. నగరంలో నిత్యం ఎదురవుతున్న ట్రాఫిక్ రద్దీ అడ్డంకులను అధిగమించి ప్రయాణికులను సమయానుకూలంగా చేరవేసే వ్యవస్థ. కాలుష్యం తగ్గడంతో పాటు భద్రత, సౌకర్యాలతో కూడిన ప్రయాణాన్ని అందించడమే మెట్రో ముఖ్య ఉద్దేశం.

Advertisement

Next Story

Most Viewed