టెక్నాలజీ వాడుతున్న మావోయిస్టులు.. పోలీసులే లక్ష్యంగా ప్రయోగాలు

by Sridhar Babu |   ( Updated:2021-11-03 09:45:29.0  )
టెక్నాలజీ వాడుతున్న మావోయిస్టులు.. పోలీసులే లక్ష్యంగా ప్రయోగాలు
X

దిశ, భద్రాచలం : మన్యంలో మావోయిస్టులు కూంబింగ్ పోలీసులను హతమార్చడానికి రకరకాల పన్నాగాలు పన్నుతున్నారు. గతంలో మందుపాత్రలు ఉపయోగించిన మావోయిస్టులు ఇప్పడు బూబీట్రాప్స్ అమర్చుతున్నారు. చర్ల అటవీ ప్రాంతంలో అడుగడుగునా కూంబింగ్ నిర్వహించే పోలీసులు వీటిని గుర్తించి వెలికితీస్తున్నారు. ఈ విషయాలను చర్ల సీఐ బి. అశోక్ బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌కి సరిహద్దుగా ఉన్న ఎర్రంపాడు అడవుల్లో మావోయిస్టు దళ సభ్యులు, మిలీషియా సభ్యులు అమర్చిన 110 బూబీట్రాప్స్ గుంతల్లోని 500 ఇనుప చువ్వలు, చెక్కలను కూంబింగ్ ఆపరేషన్‌లో పాల్గొన్న చర్ల పోలీసులు, స్పెషల్ పార్టీ సిబ్బంది, సీఆర్‌పిఎఫ్ 141 బెటాలియన్ ఏ కంపెనీ పోలీసులు గుర్తించి వెలికితీయడంతో పెనుప్రమాదం తప్పిందని తెలిపారు.

ఛత్తీస్‌‌గఢ్ రాష్ట్ర పుట్టపాడు, పెసర్లపాడు, నిమ్మలగూడెం, జెట్టిపాడు తదితర గ్రామస్తులను బెదిరించి, బలవంతంగా గుంతలు తవ్వించి మావోయిస్టు సభ్యులు బూబీట్రూప్స్ అమర్చుతున్నారని తెలిపారు.‌ ఇటీవల తెలంగాణ – చత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ ముగ్గురు ముఖ్యమైన నాయకులను కోల్పోయినందుకు ప్రతీకారంగా పోలీసులకు నష్టం కలిగించాలనే లక్ష్యంతో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. వీటివలన అడవిలో మూగజీవాలే గాకుండా అమాయక ఆదివాసీ ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. గడిచిన సంవత్సర కాలంలో పూసుగుప్ప, బత్తినపల్లి, చెన్నాపురం, ఎర్రంపాడు, చర్ల గ్రామాలకు చెందిన అనేకమంది ప్రజలు, బూబీట్రాప్స్, ఐఈడీ బ్లాస్టింగ్స్‌లలో తీవ్ర గాయాలపాలై అవయవాలను కోల్పోయారని తెలిపారు.

అనేక మూగజీవాలు మృత్యువాత పడ్డాయని తెలిపారు. ఇక్కడి ఆదివాసీ ప్రజల నుంచి మావోయిస్టులకు ఎలాంటి సహకారం లభించకపోవడంతో‌ ఛత్తీస్‌గఢ్ ఆదివాసులను బలవంతంగా ఇలాంటి పనులకు వాడుకుంటున్నారని తెలిపారు. సరిహద్దు గ్రామాల ఆదివాసీ పెద్దలను మావోయిస్టులు పిలిపించి‌ గ్రామ కమిటీ ఏర్పాటు చేయాలని, మిలీషియా ఏర్పాటు చేయాలని, అడవిలో గ్రామాలకు రోడ్లు వేయకుండా అడ్డుకోవాలని, లేకపోతే పోడుభూమి సాగుచేయడానికి, వరికోతలు కోయడానికి వీల్లేదని, ఎక్కడి నుంచి వలస వచ్చారో మళ్లీ అక్కడికే వెళ్లాలని బెదిరిస్తున్నారని తెలిపారు. దీనివలన ఆదివాసి గ్రామస్తులు మావోయిస్టు పార్టీ అంటే భయంతో బ్రతుకుతున్నారని తెలిపారు. మావోయిస్టు పార్టీలో పనిచేయడానికి ప్రజలు ఎవ్వరూ ఇప్పుడు ఇష్టపడడం లేదని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed