మరియమ్మ లాకప్ డెత్ కేసులో హైకోర్ట్ సంచలన తీర్పు..

by Sumithra |   ( Updated:2021-11-29 02:05:02.0  )
high court
X

దిశ, వెబ్ డెస్క్ : యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పోలీసు స్టేషన్‌ లాకప్‌లో మరియమ్మ అనే దళిత మహిళ చనిపోయిన సంఘటనపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించింధి. వీలైనంత తొందరగా ఈ ప్రక్రియను ముగించి నివేదికను సమర్పించేలా చొరవ తీసుకోవాలని అడ్వకేట్ జనరల్‌ను ఆదేశించింది. జ్యుడీషియల్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఈ ప్రత్యేక బృందం దర్యాప్తు కొనసాగించాలని స్పష్టం చేసింది. మరియమ్మ లాకప్‌డెత్ కేసును సీబీఐ దర్యాప్తుకు అప్పగించాల్సిన అవసరం లేదన్న ఏజీ వాదనతో హైకోర్టు ఏకీభవించింది.

గత వారం జరిగిన విచారణ సందర్భంగా సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాల్సి వస్తుందని అడ్వకేట్ జనరల్‌కు స్పష్టం చేసిన హైకోర్టు బెంచ్ ఆ విభాగం ఎస్పీ అభిప్రాయాన్ని కోరింది. మొదటి నుంచీ ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నదని, ఇద్దరు కానిస్టేబుళ్ళు సహా ఒక ఎస్ఐను విధుల నుంచి తొలగించిందని హైకోర్టుకు వివరించారు. చివరకు సీబీఐ వెలిబుచ్చిన అభిప్రాయాన్ని, ఏజీ వాదనలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక బృందాన్ని నియమించి దర్యాప్తు చేసి నివేదికను కోర్టుకు సమర్పిస్తుందని, సీబీఐ విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది.

Advertisement

Next Story