ధాన్యం కొనుగోళ్లపై మీ వైఖరేంటి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు

by Anukaran |   ( Updated:2021-11-29 04:36:11.0  )
TS High Court
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధాన్యం కొనుగోళ్లపై పూర్తి వివరాలను ఇవ్వాల్సిందిగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. బియ్యం సేకరణపై ఎఫ్‌సీఐ కూడా వివరాలను సమర్పించాలని స్పష్టం చేసింది. డిసెంబరు 6వ తేదీన జరిగే విచారణ సమయానికి కోర్టుకు అందాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం సిద్ధంగా ఉన్న వానాకాలం ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తి స్థాయిలో జరగడంలేదని, రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని లా స్టూడెంట్ శ్రీకర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు బెంచ్ సోమవారం పై ఆదేశాలు జారీచేసింది.

బియ్యం సేకరణకు ఎఫ్‌సీఐతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నదని, అందులో భాగంగా 40 లక్షల టన్నులను సేకరణ చేయాల్సి ఉన్నదని శ్రీకర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కానీ, ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారని, గుండె ఆగి చనిపోతున్నారని, మరి కొంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకారం కొనుగోలు జరిగేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఎఫ్‌సీఐకి సైతం సేకరణపై అదే తరహా ఆదేశం ఇవ్వాలని కోరారు. పిటిషనర్ తరపు న్యాయవాది అభినవ్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు బెంచ్ పూర్తి వివరాలను అందజేయాలని కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలకు, ఎఫ్‌సీఐని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబరు 6వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

అప్రమత్తంగా ఉండండి.. ఒమిక్రాన్‌పై సీఎం కేసీఆర్ ఆదేశాలు

Advertisement

Next Story

Most Viewed