నైట్ కర్ఫ్యూపై నిర్ణయం రేపు చెప్తాం : తెలంగాణ ప్రభుత్వం

by Anukaran |
నైట్ కర్ఫ్యూపై నిర్ణయం రేపు చెప్తాం : తెలంగాణ ప్రభుత్వం
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న నైట్ కర్ఫ్యూను కొనసాగించడమా లేక మార్పులేమైనా చేయడమా అనే విషయమై శుక్రవారం చెప్తామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా కట్టడిపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లను గురువారం విచారించిన బెంచ్, నైట్ కర్ప్యూ శుక్రవారం రాత్రితో ముగుస్తున్నందున ఆ తర్వాతి చర్యలేంటని ప్రభుత్వం తరపున హాజరైన అడ్వకేట్ జనరల్‌ని ప్రశ్నించింది. ఈ విషయమై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయాన్ని శుక్రవారం విచారణ సమయానికి తెలియజేస్తామని ఏజీ స్పష్టం చేశారు. పరిస్థితిని సమీక్షించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని వివరించారు.

పిటిషన్‌లపై విచారణ సందర్భంగా హైకోర్టు స్పందిస్తూ, కరోనా నియంత్రణ చర్యలపై ప్రభుత్వం దాగుడుమూతల తీరులో ఎందుకు వ్యవహరిస్తోందని ప్రశ్నించింది. నైట్ కర్ఫ్యూ శుక్రవారంతో ముగుస్తున్నందున ఒక రోజు ముందే ప్రకటిస్తే నష్టమేంటని ప్రశ్నించింది. చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవడం ఎందుకని నిలదీసింది. నియంత్రణ చర్యలపై ఇప్పటికే ప్రభుత్వానికి చాలా సూచనలు చేశామని, ఇక సూచనలు చేయదలుచుకోలేదని, క్షేత్రస్థాయి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకోవాలని వ్యాఖ్యానించింది.

ఉదయం విచారణ సందర్భంగా ప్రభుత్వంతో సంప్రదించి కర్ఫ్యూ కొనసాగింపుపై స్పష్టత ఇస్తామని అడ్వకేట్ జనరల్ చెప్పడంతో మధ్యాహ్నానికి విచారణ వాయిదా పడింది. ప్రభుత్వాన్ని సంప్రదించామని మధ్యాహ్నం విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపిన అడ్వకేట్ జనరల్ శుక్రవారం విచారణ సమయానికి నైట్ కర్ప్యూను కొనసాగించే విషయంలో అధికారిక నిర్ణయాన్ని తెలియజేస్తామని తెలిపారు. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.

Advertisement

Next Story