కరోనా పరీక్షలు పెరగాలి

by Shyam |
కరోనా పరీక్షలు పెరగాలి
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాల్లో తగిన మార్పులు అవసరం అని పేర్కొన్నారు. ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించాలని సూచించారు. ఐసీఎంఆర్‌ నిబంధనల మేరకు ప్రస్తుతం పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ వాటి సంఖ్య మరింత పెంచాల్సిన అనివార్యత ఏర్పడిందన్నారు. నగరంలోని నిమ్స్ ఆసుపత్రిలో పలువురు డాక్టర్లు, వైద్య సిబ్బంది కరోనా బారిన పడిన నేపథ్యంలో వారిలో మనోధైర్యాన్ని నింపేందుకు సోమవారం ఉదయం మిలీనియం బ్లాక్‌ను సందర్శించిన అనంతరం మీడియాతో ఆమె పై విధంగా వ్యాఖ్యానించారు. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు.

కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, పోలీసులు, మీడియా, పారిశుద్య కార్మికులు ముందు వరుసలో ఉన్నారని, వారికి రిస్కు ఎక్కువగా ఉన్నదని వ్యాఖ్యానించిన గవర్నర్ వారికి పూర్తిస్థాయిలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది తదితరులను స్వయంగా కలిసిన గవర్నర్ అధైర్యానికి గురికావద్దని, అన్ని రకాలుగా వెంట ఉంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న సడలింపులు మన జీవిత అవసరాలు, విలువల కోసమే తప్ప వైరస్‌కు కాదని ప్రజలంతా గుర్తించాలన్నారు. వైరస్ వ్యాప్తి పట్ల భయపడడంకంటే దాని బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని, ప్రతీ ఒక్కరూ దీన్ని గమనంలో ఉంచుకోవాలన్నారు.

ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందకుండా మాస్కులు ధరించడం, తరచూ చేతులు శుభ్రపర్చుకోవడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని నొక్కిచెప్పారు.

Advertisement

Next Story

Most Viewed