- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరి రైతుల కష్టాలు.. మంత్రులకు తీరిక లేక ప్రారంభాలకు బ్రేక్.!
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఓ వైపు అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురి చేస్తుండగా కొనుగోలు కేంద్రాలను మాత్రం ఇంకా ప్రారంభించడం లేదు. ఈసారి మొత్తం 6,700 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ మొదటి నుంచే కొనుగోలు కేంద్రాలు మొదలవుతాయని సీఎం కేసీఆర్వెల్లడించారు. ఇప్పటికే 22 రోజులు గడిచినా 10 శాతం కేంద్రాలను కూడా ప్రారంభించలేదు.
అంతేకాకుండా ఆయా జిల్లాల్లో కొనుగోళ్లు మొదలై 16 రోజులు దాటింది. కొన్ని జిల్లాల్లో ముందస్తు వేసిన నాట్లతో ఈ నెల మొదట్లోనే కోతలు చేశారు. కల్లాల్లో ఆరబెట్టారు. కానీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో ఇంకా కల్లాల్లోనే ఎండుతోంది. అయితే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు అమాత్యులకు తీరిక లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు అధికారులు ఆఫ్ ది రికార్డుగా చెప్పుతున్నారు. ఈ నెల 19 వరకు రాష్ట్రంలో 1377 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత నుంచి దాదాపు మరో 100 కేంద్రాల వరకు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ప్రధానంగా పుర ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల వైపు కన్నెత్తి చూడటం లేదు.
అటు వర్ష గండం..
రాష్ట్రంలోని మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో అకాల వర్షం ముంచెత్తింది. ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలను గత గురువారం నుంచి విడుతలు వారీగా అకాల వర్షం వీడలేదు. ఇటీవల కురిసిన వర్షంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చర్ల, పాల్వంచ, ఇల్లెందు, జూలూరుపాడు, బూర్గంపాడు మండలాల్లో కల్లాల్లో ఆరబోసిన మిర్చి రాశుల్లోకి నీళ్లు చేరి మిరపకాయలు కొట్టుకుపోయాయి. పలుచోట్ల పట్టాలు కప్పి ఉంచినప్పటికీ కింది నుంచి జలాలు చేరి తడిశాయి. వరిపంట నేలవాలింది. బూర్గంపాడు మార్కెట్ యార్డు, వైరా, తల్లాడ మండలాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. కారేపల్లిలో ఈదురుగాలులకు వరిపంట నేలవాలగా, మామిడికాయలు రాలిపోయాయి.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని యాచారం, చేవెళ్ల మండలాల్లోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. వేల ఎకరాల్లోని వరిపంట నేలవాలింది. మామిడి తోటలు, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో కురిసిన వానలతో గోదావరి తీరాన ఆరబోసిన మిర్చి తడిసిపోయింది. భూపాలపల్లి, జనగామ, వరంగల్ రూరల్ జిల్లాల్లోనూ వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. జనగామ జిల్లా వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి, ఐనవోలు మండలాల్లో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా వరి, మొక్కజొన్న పంటలు.. ఈదురు గాలుల ధాటికి పూర్తిగా నీట మునిగాయి. దమ్మన్నపేటలో మామిడి కాయలు నేల రాలాయి. కక్కిరాలపల్లిలో.. అమ్మకానికి సిద్ధంగా ఉన్న పసుపు, మిర్చి, మొక్కజొన్న పంట నీట మునిగినట్లు వ్యవసాయాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రాథమిక నివేదికల ప్రకారం 24 వేల హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాల్లో పేర్కొన్నారు.
మళ్లీ వర్షాలు..
మరోవైపు రాష్ట్రంలో అకాల వర్షాలు ఆగడం లేదు. మంగళవారం నుంచి బుధవారం రాత్రి వరకు ఆయా జిల్లాల్లో వర్షపాతం నమోదైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2.8 సెంటిమీటర్లు, సూర్యాపేట జిల్లాలో 2.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదే విధంగా కుమ్రంభీం ఆసిఫాబాద్, జోగుళాంబ గద్వాల, నల్గొండ, మంచిర్యాల, ఖమ్మం, రంగారెడ్డి, ఆదిలాబాద్, సూర్యాపేట జిల్లాల్లో వర్షం కురిసింది. గురువారం నుంచి శుక్రవారం వరకు రాష్ట్రంలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, జనగాం, ఖమ్మం, సూర్యాపేట, యాద్రాద్రి భువనగిరి, నల్గొండ, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, మెదక్, సిద్ధిపట జిల్లాల్లో కూడా వర్షం కురిసే అవకాశాలున్నట్లు బుధవారం వాతావరణ శాఖ హెచ్చరించింది.
రంగు మారింది కొనడం ఎలా..?
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం తరుపున మంత్రి ప్రకటించేది ఒకటుంటే… క్షేత్రస్థాయిలో మరోలా ఉంటోంది. రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉన్నామంటూ మంత్రి నిరంజన్‌రెడ్డి ఇటీవల ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం కొనుగోళ్లు చేయడం లేదు. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ఆదేశాలు రాలేదని, రంగుమారిన ధాన్యం కొనమంటూ స్పష్టంగా చెప్పుతున్నారు. దీంతో కల్లాల్లోనే ధాన్యం పేరుకుపోతోంది.
రూ. 1250 నుంచి రూ. 1500కు ఇస్తారా..?
అసలు సమయంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం లేదు. దీంతో దళారులు కల్లాలపై వాలుతున్నారు. కొన్నిచోట్ల రూ. 1250 చొప్పున అమ్మాలని, ఇంకా ఆలస్యమైతే ఇబ్బందులు ఉంటాయని రైతులను బెదిరిస్తున్నారు. బోధన్ ప్రాంతంలో రైతుల నుంచి రూ. 1250 చొప్పున కొనుగోలు చేస్తున్న వైనం బయటకు వచ్చింది. మరోవైపు పండించిన పంట రోడ్లపైన ఆరబెట్టాల్సి వస్తోంది. దీంతో విధిలేని పరిస్థితుల్లో రైతులు ధాన్యాన్ని దళారులకు అప్పగిస్తున్నారు.
మాకేం తెల్వదు..
యాసంగి పంట చేతికి వచ్చి 15 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. ఇదే సమయంలో దళారులు తక్కువ రేటుకు అడగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అటు వ్యవసాయశాఖ నుంచి కూడా ఎలాంటి స్పందన రావడం లేదు. యాసంగి పంట దిగుబడి వచ్చినప్పటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది.
సారీ మంత్రులకు సమయం లేదు..
మరోవైపు మంత్రుల కోసం కొనుగోలు కేంద్రాలు ఎదురుచూస్తున్నాయి. అమాత్యులు వచ్చి రిబ్బన్కట్చేస్తేనే కొనుగోళ్లు మొదలుపెడుతామని కొన్ని ప్రాంతాల్లో అధికారులు భీష్మించుకుని ఉన్నారు. అటు మంత్రులకేమో తీరిక లేకుండా పోయింది. మంత్రులంతా పుర ఎన్నికల ఇంఛార్జీ బాధ్యతల్లో బీజీగా ఉన్నారు. టికెట్ల కేటాయింపు, ప్రచారం లొల్లి నడుస్తోంది. ఈ సమయంలో కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.