- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాయీబ్రాహ్మణుల అష్ట కష్టాలు
దిశ, తెలంగాణ బ్యూరో : నాయీ బ్రాహ్మణ వృత్తిలోకి కార్పొరేట్, ఆన్ లైన్ లో సేవల పేరుతో ‘అర్బన్ క్లాప్’లాంటి పలు సంస్థలు రావడంతో వృత్తినే నమ్మకొని జీవనం సాగిస్తున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పెట్టుబడి పెట్టి సెలూన్లు ఏర్పాటు చేయలేక, ఇతర వృత్తి రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలోనే కరోనా అటాక్ కావడంతో ములిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది నాయీబ్రాహ్మణుల పరిస్థితి. వృత్తిని వదులుకోలేక, కుటుంబాన్ని పోషించుకోలేక లోలోన మదనపడుతున్నారు. ప్రభుత్వ సాయం కోసం ఆశతో ఎదురుచూస్తున్నారు.
కత్తెరకు పని ఉంటేనే కడుపు నిండేది…
ఆ రోజు పనిలేకుంటే పస్తులుండే పరిస్థితి. అసలే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నాయీబ్రాహ్మణులపై కార్పొరేట్ సంస్థల రూపంలో పిడుగు పడింది. మున్సిపాలిటీ, పట్టణాలు, నగరాల్లో నేచురల్, లుక్స్ తదితర పేర్లతో కార్పొరేట్ సంస్థలు వెలిశాయి. దీంతో నాయీబ్రాహ్మణులకు ఉపాధి కరువైంది. దీనికి తోడు ఆన్ లైన్ లో సేవల పేరుతో ‘అర్బన్ క్లాప్’ కార్యకలాపాలను ప్రారంభించి ఇంటికే సేవలందించేలా చర్యలు చేపట్టింది. వీటన్నింటితో పాటు కరోనాతో అంతో ఇంతో ఉపాధి పొందుతున్న నాయీ బ్రాహ్మణులకు గిరాకీ లేకుండా పోయింది. మడిగల అద్దెలు, కరెంటు బిల్లులు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. అంతేకాదు ఇళ్ల కిరాయి, కుటుంబ పోషణ భారం కావడంతో 40 శాతం మేర దుకాణాలను మూసివేశారు. ఇదే పరిస్థితి ఉంటే మరో 10శాతం కూడా మూసివేసే పరిస్థితి నెలకొంటుందని పలువురు నాయీబ్రాహ్మణులు ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో10లక్షల మంది…
తెలంగాణ రాష్ట్రంలో 80వేలు కటింగ్ షాపులు ఉన్నాయి. సుమారు 3లక్షల వరకు పని చేస్తుండగా, అందులో గ్రేటర్ హైదరాబాద్ లోనే 20వేల కటింగ్ షాపులు ఉండగా 50 వేల మంది పనిచేస్తున్నారు. మొత్తం ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 10లక్షలకు పైగా జీవనోపాధి పొందుతున్నారు. కటింగ్ కు రూ.100, షేవింగ్ రూ.50, కలర్ రూ.150 తీసుకుంటున్నారు. మడిగె అద్దె సుమారు 8వేలు, కరెంటు బిల్లు రూ.1000, ఇతర ఖర్చులు మరో 500లతో పాటు ఇంటి అద్దెలు, కుటుంబ పోషణకు మరో రూ.10వేలు అవుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నడిస్తే గిట్టుబాటు అయ్యేది. కానీ లాక్ డౌన్ ఓవైపు, మరో వైపు ఈ వృత్తిలోకి కార్పొరేట్ సంస్థలు రంగ ప్రవేశం చేయడంతో జీవనోపాధిపై ఎఫెక్ట్ పడింది. షాపుల నిర్వహణకు, కుటుంబ పోషణకు తీసుకొచ్చిన అప్పులు భారంగా వచ్చాయి. వచ్చే కొద్దిపాటితో వడ్డీలు చెల్లించడానికి సరిపోతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కరువై రోడ్డున పడే పరిస్థితి దాపురించింది.
కార్యరూపం దాల్చని ఫ్రీ కరెంటు
గతంలో పలుమార్లు సెలూన్లకు ఉచిత కరెంటుపై ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ కార్యరూపం దాల్చలేదు. తిరిగి నాగార్జున సాగర్ ఉప ఎన్నికలకు ముందు ఏప్రిల్ 4న అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సెలూన్లకు ఫ్రీ కరెంటు ను వెంటనే అమల్లోకి తీసుకురావాలని ఆదేశించారు. తేదీ 4.04.2021న బీసీ సంక్షేమశాఖ ద్వారా ఉత్తర్వులు సైతం జారీ చేశారు. కానీ రెండు నెలలు గడుస్తున్నా కార్యరూపం దాల్చలేదు. కరోనా నేపథ్యంలో కనీసం సెలూన్లకు ఉచిత కరెంటు ఇస్తేనన్న కొంత చేయూత నిచ్చినట్లు అవుతుందని సెలూన్ల నిర్వహకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇది ఇలా ఉంటే మడిగకు మున్సిపల్ లైసెన్స్, ఓనర్ అగ్రిమెంట్ ఇవ్వడం లేదు. అది ఉంటేనే ఉచిత కరెంటు నిబంధన పెట్టడం శాపంగా మారింది. గతంలోని సీఏటీ, 2డీ హెచ్సీఎస్ కేటగిరి కింద ఏ విధంగా సబ్సిడీ ఇస్తున్నారో అదే విధంగా ఆధార్ కార్డు, కమ్యూనిటీ సర్టిఫికెట్, కటింగ్ షాపును బేస్ చేసుకొని ఇస్తే వెసులుబాటు కలిగే అకాశం ఉంది.
ప్రధాన డిమాండ్లు
షరతులు లేకుండా 250 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇవ్వాలి. మూడు నెలల సర్ చార్జీలు ముందే చెల్లించాలనే నిబంధన తొలగించాలి. నాయీ బ్రాహ్మణులను సూపర్ స్ప్రెడర్స్ గా గుర్తించాలి. లాక్ డౌన్ నుంచి సెలూన్లకు మినహాయింపు ఇవ్వాలి. రూ.50వేలు నూరుశాతం సబ్సిడీతో ఇవ్వాలి. కరోనా సోకిన వారికిఉచిత కార్పొరేట్ వైద్యం, ఈఎస్ఐ సదుపాయం కల్పించాలి. మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి. అర్బన్ క్లాప్ ఆన్లైన్ సేవలను నిషేధించాలి.
సీఏటీ, 2డీహెచ్సీఎస్ కేటగిరి కింద ఉచిత కరెంటు ఇవ్వాలి
ప్రభుత్వం సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఎలాంటి షరతులు లేకుండా సీఏటీ, 2డీహెచ్సీఎస్ కేటగిరి కింద ఉచిత కరెంటు ఇవ్వాలి. సీఎం హామీ ఇచ్చి 2 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు విధి విధానాలు రూపొందించలేదు. కరోనా సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైన ప్రభుత్వం ఇచ్చినమాట నిలబెట్టుకోవాలి. సూపర్ స్ప్రెడర్స్ గా నాయీబ్రాహ్మణులను గుర్తించాలి. కరోనా బారిన పడకుండా కాపాడాలి.
-రాచమల్ల బాలకృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు, నాయీబ్రాహ్మణ సేవాసంఘం
రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి
నాయీ బ్రాహ్మణులు వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. వారు మృతి చెందితే కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వారిని ఆదుకునేందుకు రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి. సహజమరణమైనా ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. కరోనా బారినపడితే వారికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలి.
-చింతల శ్రీనివాస్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, నాయీబ్రాహ్మణ సేవాసంఘం
పూట గడువడమే కష్టంగా ఉంది
లాక్ డౌన్ కు ముందు షాపు కిరాయి, ఇంటి అద్దెలు, కరెంటు బిల్లులు ఎల్లేవి. గతేడాది నుంచి కరోనాతో గిరాకీ తగ్గింది. అప్పలు తెచ్చి షాపు నడిపిస్తున్నా. ఇప్పడు కరోనా సెకండ్ వే తో 4 గంటలు మినహాయింపు ఇవ్వడంతో రూ.300 వందలు కూడా వస్తల్లేవు. పూటగడువడమే కష్టమైంది. ప్రభుత్వం రూ.50వేలు నూరుశాతం సబ్సిడీపై ఇచ్చి ఆదుకోవాలి.
-మహేష్, మురళీ సెలూన్ నిర్వహకుడు, యూసుఫ్ గూడ
‘అర్బన్ క్లాప్’ఆన్ లైన్ సేవలను నిషేధించాలి
మా తాత, తండ్రుల నుంచి వారసత్వంగా కటింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. వచ్చే కొద్దిపాటితో కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. అర్బన్ క్లాప్ పేరుతో ఆన్ లైన్ సేవలను ప్రారంభించడంతో మాకు ఉపాధి లేకుండా పోయింది. మా కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం స్పందించి అర్బన్ క్లాప్ సేవలను నిషేధించి మమ్ముల్ని కాపాడాలి.
-హరీష్, నాయీబ్రాహ్మణుడు, వెంకటగిరికాలనీ