ఆ దోషం పోవాలని.. చిన్నారి గొంతుకోసిన తల్లి

by Sumithra |   ( Updated:2021-04-15 11:16:59.0  )
daughter murdered by her mother
X

దిశ, కోదాడ: కరోనావైరస్ వ్యాప్తితో పాటే రాష్ట్రంలో మూఢనమ్మకాల వ్యాప్తి కూడా జోరుగా పెరుగుతోంది. ఇటీవల నరబలి ఇస్తే కరోనా రాదని కలలో కనిపించి దేవుడు చెప్పాడని ఒక వ్యక్తిని హతమార్చడం, ఆ తర్వాత కరోనా తగ్గాలంటే శాంతి పూజలు చెయ్యాలంటూ ఒక గ్రామ ప్రజలు ఏకంగా 400 గొర్రెలను బలివ్వడం మనం ఇప్పటికే చూశాం. తాజాగా.. మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. మూఢ నమ్మకాల పేరుతో అభంశుభం తెలియని ఆరునెలల పసిపాప గొంతును ఏకంగా కన్న తల్లే కోసి హత్య చేసింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మోతే మండలం మేకలపాడు తండాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన బానోతు భారతికి గత ఆరేండ్ల క్రితం ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోక మూఢనమ్మకాలకు బానిసయ్యింది.

ఈ క్రమంలోనే రోజూ యూట్యూబ్‌లో, నెట్‌లలో వస్తున్న మూఢనమ్మకాల వీడియోలు చూడటం ప్రారంభించింది. ఈ సందర్భంలో తనకున్న దోషాన్ని తొలగించుకునేందుకు గాను తన 6 నెలల పసిపాపను బలి ఇవ్వాలని నిర్ణయించుకుంది. గురువారం సాయంత్రం భర్త ఇంట్లో లేని సమయంలో శివుని(దేవుడు) బొమ్మ ను పక్కన పెట్టుకొని కత్తితో తన కూతురైన రీతు(6 నెలలు) గొంతు కోసి హత్యచేసింది. తర్వాత ఇంటికి వచ్చిన భర్తతో పాటు స్థానికులు ఈ సంఘటన చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే మునగాల సర్కిల్ ఇన్స్‌పెక్టర్ ఆంజనేయులు, ఎస్సై ప్రవీణ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఆంజనేయులు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story