కరోనా పెరగడానికి కీలక కారణాలు అవే : ఎయిమ్స్ డైరెక్టర్

by Shyam |   ( Updated:2021-08-14 08:57:46.0  )
AIIMS director
X

దిశ, పటాన్‌చెరు: ఈ శతాబ్దంలోనే కొవిడ్-19 మహమ్మారి అత్యంత ఘోరంగా ఉందని, మొత్తం ప్రపంచ జనాభాకు టీకాలు వేయడం ద్వారానే దానిని కట్టడి చేయగలమని అఖిల భారత వైద్య సంస్థ (ఎయిమ్స్) డైరెక్టర్ ప్రొఫెసర్ రణదీప్ గులేరియా అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం 41వ వ్యవస్థాపక దినోత్సవం శనివారం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన గీతం ఫౌండేషన్ ఎండోమెంట్ లెక్చర్ ఇచ్చారు. గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ గీతం 41వ ఫౌండేషన్ అవార్డును ప్రొఫెసర్ గులేరియాకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ రణదీప్ మాట్లాడుతూ పెరుగుతున్న పట్టణీకరణ, జంతువుల ఆవాసాలను కోల్పోవడం, ముఖ్యంగా మనుషులుతో సహజీవనం చేయడం వంటిని 21వ శతాబ్దంలో కొవిడ్ మహమ్మారి పెరగడానికి కీలక కారకాలని అన్నారు.

ప్రపంచంలో అత్యధికంగా నమోదైన కొవిడ్-19 మరణాలలో మనదేశం మూడో స్థానంలో ఉందని, ఇది జీవనోపాధి, ఆరోగ్యం, పాలనా వ్యవస్థ, సామాజిక సమ్మేళనం, ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతోందని ఆయన పేర్కొన్నారు. కొవిడ్ -19 మహమ్మారి ముగియలేదని, లేదా ఇదే చివరి మహమ్మారి కాదని ఆయన స్పష్టీకరించారు. ఈ మహమ్మారి నివారణకు, పూర్తి సంసిద్ధతతో పెట్టుబడులు పెట్టడానికి, భవిష్యత్తులో వచ్చే మహమ్మారిని ఎదుర్కోవడానికి మనం ప్రత్యేకంగా సన్నద్ధం కావాలని డాక్టర్ గులేరియా పిలుపునిచ్చారు. ఈ మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఉండడానికి ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని, వ్యాక్సిన్ వేయించుకోవడంతో పాటు మాస్కులు ధరించాలని పల్మనరీ మెడిసిన్ లో ప్రసిద్ధుడైన డాక్టర్ రణదీప్ సలహా ఇచ్చారు.

వ్యాక్సిన్ పై ఉన్న అపోహలే ప్రజల్లో రోగనిరోధక శక్తి పెరుగుదలకు అవరోధంగా మారుతోందని, ఎటువంటి సంకోచం లేకుండా అంతా టీకా వేయించుకోవాలన్నారు. వ్యాధికి గురికాకుండా వ్యాక్సిన్ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందని, వాటిని మానవులపై పరీక్షించడంతో పాటు ప్రీ-క్లినికల్ ట్రయల్స్ చేసిన తరువాతే అనుమతి ఇచ్చినట్టు ఆయన చెప్పారు.

Advertisement

Next Story