- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాగర్ బరిలో కామ్రేడ్స్ ఎక్కడ..?
దిశ, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లా పోరాటాల ఖిల్లా. నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మొదలుకుని.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వరకు నల్లగొండ జిల్లా ఎనలేని పాత్ర పోషించింది. అందులో కమ్యూనిస్టుల పాత్ర చెప్పుకోదగినది. కానీ ఇదంతా గతం. ప్రజాసమస్యల పరిష్కారినికి ధర్నాలు, రాస్తారోకోలు, రైల్ రోకోలతో నిత్యం ప్రజల మధ్య ఉండే కమ్యూనిస్టులు రోజురోజూకీ కనుమరుగవుతున్నారు. ప్రస్తుత కమ్యూనిస్టులు రాజకీయాలకే పెద్దపీట వేస్తున్నారు. స్వతంత్రంగా పోరాటం చేసే శక్తిని కోల్పోయారేమోనన్నట్టు వారి పరిస్థితి మారింది. ఇటీవల కాలంలో ప్రజాసమస్యలపైనూ పోరాడేందుకు ఉమ్మడి జిల్లాల్లో కమ్యూనిస్టులు ముందుకు రాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలావుంటే.. రాష్ట్రమంతా నాగార్జునసాగర్ ఉపఎన్నికపై దృష్టిపెడితే.. కమ్యూనిస్టులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు.
సాగర్ బరిలో నిలవడం కష్టమే..
నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రస్తావన వచ్చిన నాటి నుంచి రాజకీయ పార్టీలన్ని ఈ నియోజకవర్గంపైనే ఫోకస్ పెట్టాయి. ప్రధాన పార్టీల దగ్గరి నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థుల వరకు ఎన్నికల ప్రక్రియకు సన్నద్ధమవుతుంటే.. కమ్యూనిస్టుల్లో మాత్రం నేటికీ ఉలుకుపలుకు లేకుండా పోయారు. వాస్తవానికి కమ్యూనిస్టు ఓటర్లు.. ఎవ్వరెన్నీ చెప్పినా.. కమ్యూనిస్టు పార్టీలు చెప్పిందే పాటిస్తారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా….తలొగ్గడం మాత్రమే కష్టమే. అయితే నేటికీ క్షేత్రస్థాయిలో కమ్యూనిస్టు పార్టీల ఓటర్లు, సానుభూతిపరుల సంఖ్య తక్కువేం లేదు. కానీ వారిని నడిపించడంలోనే కమ్యూనిస్టు నాయకత్వాలు విఫలమవుతున్నాయని చెప్పాలి. నామినేషన్ల తుది గడువు దగ్గర పడుతున్నా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బలంగా ఉండే సీపీఐ, సీపీఎంలు మాత్రం తమ అభ్యర్థిని గానీ క్షేత్రస్థాయిలో ప్రచారం గానీ చేసిన పాపాన పోలేదు.
మద్దతు రాజకీయాలతోనే సరి..
సీపీఎం, సీపీఐ పార్టీల పోకడ ఇటీవల తీవ్రమైన విమర్శలకు దారితీస్తోంది. ప్రజా పోరాటాలు మర్చిపోవడం సంగతేమో గానీ సొంత పార్టీ శ్రేణుల నుంచే విమర్శలు ఎదుర్కొంటుంది. ఆ రెండు పార్టీల నుంచి కనీసం చట్టసభల్లో తమ గొంతు విన్పించే వారు కూడా లేకుండా పోయారు. జీహెచ్ఎంసీ, మండలి ఎన్నికల్లోనూ పేలవ ప్రదర్శనను మూటగట్టుకున్నారు. సీపీఐ పార్టీ ఇతర పార్టీ అభ్యర్థులకు మద్దతునివ్వడంతోనే సరిపెట్టుకుంటోంది. సాగర్ ఉపఎన్నికలోనూ సీపీఐ, సీపీఎంల మద్దతును కాంగ్రెస్ పార్టీ కోరుతూ లేఖ రాశారు. దీనికి స్పందించిన చాడ వెంకట్ రెడ్డి.. ముఖ్య నేతలతో సమావేశమై.. త్వరలోనే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏ ఎన్నికలు జరిగినా.. హోరాహోరీ తలపడే కమ్యూనిస్టులు.. కనీసం అభ్యర్థులను నిలిపేందుకు పెద్దగా ఆసక్తి చూపడం చర్చనీయాంశం అవుతోంది.