కార్మిక చట్టాలకు సవరణలు.?

by Anukaran |
కార్మిక చట్టాలకు సవరణలు.?
X

దిశ, తెలంగాణ బ్యూరో: అనేక సంచలన చట్టాలను చేస్తూ ఉన్న కేంద్ర ప్రభుత్వం త్వరలో మరో సంస్కరణకు శ్రీకారం చుట్టనుంది. కేంద్ర కార్మిక చట్టాలకు అనుగుణంగా రాష్ట్రాల్లోని కార్మిక చట్టాలకు కూడా తగిన మార్పులు చేర్పులు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా త్వరలోనే అన్ని రాష్ట్రాలకు కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ లేఖ రాయాలనుకుంటోంది. కార్మిక చట్టాలకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంతో పనిచేసే ‘కన్‌కరెంట్ లిస్టు’లో ఉండగా ఇకపై కేంద్ర చట్టాలకు సారూప్యంగా ఉండే తీరులో రాష్ట్రాల చట్టాల్లో కూడా సవరణలు చేయించాలని ఆలోచిస్తోంది. అలాంటి మార్పులు చేయాల్సిందిగా రాష్ట్రాలకు లేఖ రాసేముందు లీగల్ నిపుణులను నియమించి ఆయా రాష్ట్రాల కార్మిక చట్టాలను అధ్యయనం చేయించాలనుకుంటోంది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత కేంద్ర చట్టాలకు, రాష్ట్ర చట్టాలకు మధ్య ఉన్న తేడాలకు అనుగుణంగా నిర్దిష్టంగా ఆయా రాష్ట్రాలకు రాసే లేఖలో ఎలాంటి సవరణలు చేయాలో సూచనలు చేయనున్నట్లు సమాచారం.

భిన్నాభిప్రాయాలున్న సమయంలో

ఒకవైపు మూడు వ్యవసాయ చట్టాల విషయంలో రాష్ట్రాలకు, కేంద్రానికి మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్న సమయంలో కార్మిక చట్టాల విషయంలో కూడా మార్పులకు కేంద్రం వత్తిడి చేసేలా ప్రయత్నిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర కార్మిక చట్టాలకు సవరణలు చేయడంపై ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టాయి. ఇప్పుడు రాష్ట్రాల కార్మిక చట్టాల్లో సైతం తగిన సవరణలు చేయాలని వత్తిడి తీసుకొచ్చే తరహాలో ప్రయత్నాలు చేస్తుండడం రాష్ట్రాల హక్కులను కాలరాయడమేనన్న విమర్శలకు దారితీస్తుంది కాబోలు! ఒకవేళ రాష్ట్ర చట్టాలకు సవరణలు చేయడానికి ప్రభుత్వాలు సిద్ధపడకపోతే రాష్ట్రపతి ద్వారా సవరణలు చేయాలన్న సూచన కూడా చేయనున్నట్లు సమాచారం.

కరోనా కాలం నుంచే మొదలు

కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడం, దాన్ని విధిగా రాష్ట్రాలు అమలు చేయాల్సి వచ్చింది. కానీ అన్‌లాక్ సమయంలో కొన్ని రాష్ట్రాలు పెట్టుబడులను ఆకర్షించడం కోసం, ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం కోసం ఆంక్షల సడలింపులో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర కార్మిక శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల కార్మిక చట్టాల్లోని నిబంధనలకు అనుగుణంగా స్వచ్ఛందంగా ఆంక్షలను రూపొందించడం, సడలించడం లాంటివి చేశాయని, కొన్ని నిబంధనలను ఏకంగా మూడేళ్ళ వరకు వర్తించేలా మార్పులు చేర్పులు చేసుకున్నాయని కేంద్రానికి సమాచారం అందింది. దీంతో అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ జోక్యం చేసుకుని భారత ప్రధానికి లేఖ రాసి కార్మికుల హక్కులు, చట్టాల పటిష్ట అమలు తదితరాలపై దృష్టి పెట్టాల్సిందిగా సూచించినట్లు ఆ శాఖ అధికారులు సూచనప్రాయంగా తెలిపారు.

తేడాలను నివారించవచ్చన్న లక్ష్యంతో

కేంద్ర కార్మిక చట్టాల్లోని స్ఫూర్తికి అనుగుణంగానే రాష్ట్రాల కార్మిక చట్టాలు కూడా ఉండడం ద్వారా ఇలాంటి తేడాలను నివారించవచ్చన్న లక్ష్యంతో త్వరలో సవరణలు చేయాలని రాష్ట్రాలపై వత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దేశం మొత్తానికి కార్మిక చట్టాల్లో ఒకే రకమైన స్ఫూర్తి, సారూప్యత ఉండేలా మార్పులు తీసుకురావడం అనివార్యం అని భావించినట్లు సమాచారం. అప్పుడు మాత్రమే కేంద్ర చట్టాల వెలుగులో రాష్ట్రాల చట్టాలు ఉండగలుగుతాయని, స్ఫూర్తికి విఘాతం లేకుండా ఉంటుందని, కేంద్రం చేపట్టబోయే సంస్కరణలకు మార్గం సుగమం అవుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందువల్లనే రాష్ట్రాలకు త్వరలో కేంద్ర కార్మిక శాఖ ఈ తరహా సవరణలు చేయాలంటూ సూచనలు చేయనున్నట్లు తెలిసింది. ఒకవైపు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్రాలను ప్రోత్సహిస్తూ సంస్కరణల అమలుపైనా, సులభ వాణిజ్య విధానంపైనా స్వేచ్ఛనిస్తూనే మరోవైపు కార్మిక చట్టాల విషయంలో మాత్రం కేంద్ర చట్టాలకు లోబడే ఉండే తీరులో సవరణలు చేయాలని సూచించడం విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికే రాష్ట్రాలపై కేంద్ర పెత్తనం పెరిగిపోయిందని, సహకార సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల హక్కులకు విఘాతం కలుగుతోందని విమర్శలు వస్తున్న సమయంలో కార్మిక చట్టాల విషయంలోనూ ‘వన్ నేషన్ – వన్ లేబర్ కోడ్’ తరహాలో వత్తిడి తెచ్చే విధంగా వ్యవహరించడం మరింత ఆగ్రహం కలిగిస్తోంది. రాష్ట్రాల చట్టాలను అధ్యయనం చేసిన తర్వాత కేంద్రం నుంచి ఏ తరహా లేఖలు వస్తాయో, అందులో ఏమేం సవరణలు చేయాలని సూచనలు ఉంటాయో స్పష్టమైన తర్వాత మాత్రమే స్పందించాలని రాష్ట్రాల కార్మిక శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story