వ్యాక్సినేషన్ మరింత వేగవంతం : కేంద్రం

by Shamantha N |
Bharat Biotech
X

న్యూఢిల్లీ: దేశంలో టీకా పంపిణీ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసి వీలైనంత తొందరగా ప్రజలందరికీ టీకా వేయాలని కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇందుకోసం దేశీయ టీకా తయారీ సంస్థలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి చేయూతనిస్తున్నది. ఆత్మనిర్భర్ భారత్ 3.0 మిషన్ కొవిడ్ సురక్షా కింద దేశీయ టీకాల ఉత్పత్తి వేగం పెంచడానికి నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. అలాగే, విదేశాల నుంచీ టీకాలను దిగుమతి చేసుకోవడానికి సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపింది. భారత్ బయోటెక్ దగ్గర ఆరు కోట్ల డోసులున్నాయని ప్రచారంలో ఉన్న వాదన సరికాదని పేర్కొంది. అయితే, ఆ సంస్థ టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని కొవిడ్ సురక్షా మిషన్ కింద పటిష్టపరుస్తున్నట్టు వివరించింది. మే-జూన్ నుంచి జులై-ఆగస్టు మధ్యలో కనీసం ఆరు నుంచి ఏడు రెట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచనున్నట్టు వెల్లడించింది.

అంటే ఏప్రిల్‌లో కోటి టీకా డోసులు ఉత్పత్తి చేసిన భారత్ బయోటెక్ జులై-ఆగస్టుకల్లా ఆరు నుంచి ఏడు కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తుందని, సెప్టెంబర్ కల్లా నెలకు పది కోట్ల డోసులను ఉత్పత్తి చేసే అవకాశముందని తెలిపింది. శుక్రవారం (28వ తేదీ) ఉదయంనాటికి భారత్ బయోటెక్ కేంద్రానికి 2,76,66,860 డోసులను సరఫరా చేసిందని, ఇందులో 2,20,89,880 డోసులను రాష్ట్రాలు పంపిణీ చేశాయని వివరించింది. 55,76,980 డోసులు ప్రస్తుతం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల దగ్గర ఉన్నాయని పేర్కొంది. మే నెలలో అదనంగా 21,54,440 డోసులను రాష్ట్రాలు పంపిస్తామని తెలిపింది. జూన్‌లో 90,00,000 డోసులను ప్రభుత్వానికి సంస్థ అందివ్వడానికి కమిట్‌మెంట్ ఇచ్చిందని వెల్లడించింది.

Advertisement

Next Story