ఫలించిన ఏపీ ఆశలు.. విశాఖ రైల్వేజోన్‌కు గ్రీన్ సిగ్నల్..

by Anukaran |
ఫలించిన ఏపీ ఆశలు.. విశాఖ రైల్వేజోన్‌కు గ్రీన్ సిగ్నల్..
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని ప్రధాన అంశమైన విశాఖ రైల్వే జోన్‌ ఇక అటకెక్కినట్లేనని భావిస్తున్న తరుణంలో కేంద్రం తీపి కబురు చెప్పింది. త్వరలోనే దక్షిణ కోస్తా రైల్వేజోన్ పనులు ప్రారంభిస్తామని ప్రకటించింది. విభజన చట్టంలోని హామీలో భాగంగా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం గతంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఏళ్లు గడుస్తున్నప్పటికీ పనులు ఆశించినంతగా జరగకపోవడంతో పార్లమెంటులో రాష్ట్రానికి చెందిన ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించారు. ఎంపీల ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి గందరగోళ ప్రకటన చేశారు. దేశంలో కొత్త రైల్వే జోన్ల ఏర్పాటు ఉద్దేశం లేదని చెప్పారు. దీంతో రాష్ట్రంలో గందరగోళం నెలకొంది.

ప్రత్యేక హోదాపోయే.. ఇప్పుడు రైల్వే జోన్ కూడా పోయే అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు సైతం కేంద్రం తీరుపై మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డి శుక్రవారం కేంద్ర మంత్రితో భేటీ కాగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి పనులు త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు హామీ ఇచ్చినట్లు తెలిపారు. వైసీపీ ఎంపీలు క్లారిటీ ఇవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

పనుల్లో కనిపించని పురోగతి

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని 35 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు అంశాన్ని విభజన హామీ చట్టంలో కేంద్రం పొందు పరిచింది. హామీ చట్టంలో రైల్వే జోన్ అంశం ఉన్నప్పటికీ దానిపై కేంద్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మెుదలయ్యాయి. దీంతో దిగొచ్చిన కేంద్రం 2019 ఫిబ్రవరిలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అంతేకాదు విశాఖ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. అనంతరం ఈ జోన్‌కు ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్‌’ అని నామకరణం చేసినట్లు నాటి రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు.

దక్షిణ మధ్య రైల్వే నుంచి విజయవాడ, గుంటూరు, గుంతకల్‌ డివిజన్లు, తూర్పు కోస్తా జోన్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాంతాలను కలిపి ఈ జోన్ ఏర్పాటవుతుందని ప్రకటించారు. జోన్‌ పనుల నిమిత్తం ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ(ఓఎస్‌డీ)గా భారతీయ రైల్వే సిబ్బంది సర్వీసు అధికారి ఎస్‌ఎస్ శ్రీనివాస్‌ను సైతం ప్రభుత్వం నియమించింది. ఆర్థిక, సాంకేతిక అంశాలన్నింటినీ పేర్కొంటూ జోన్‌ ఎలా ఏర్పాటు చేయాలో డీపీఆర్‌ను రెండేళ్ల క్రితమే రైల్వే బోర్డుకు ఓఎస్డీ పంపించడం.. కేంద్ర బృందం అధ్యయనం చేయడం జరిగింది. అంతేకాదు 2021-22 బడ్జెట్‌లో దక్షిణ కోస్తా రైల్వేజోన్‌కు రూ. 40 లక్షలు సైతం కేటాయించింది.

పార్లమెంట్‌లో గందరగోళ ప్రకటన

2019లో దక్షిణకోస్తా రైల్వేజోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. ఆ తర్వాత గత రెండు బడ్జెట్లలోనూ కేంద్రం నిధులు కేటాయించారు. ఆ తర్వాత ఎలాంటి ముందడుగూ లేదు. తాజాగా బీజేపీ ముజఫర్‌పూర్‌ (బిహార్‌) ఎంపీ అజయ్‌ నిషాద్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి వైష్ణవ్‌ బదులిస్తూ దేశంలో ప్రస్తుతం 17 రైల్వే జోన్లు ఉన్నాయని.. ఇక ఒత్తిళ్లకు తలొగ్గి ఎక్కడా కొత్త జోన్‌ ఏర్పాటు చేసే ప్రసక్తే లేదని లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో 17 రైల్వేజోన్లు మాత్రమే ఉన్నట్లు తెలిపారు. కేంద్రమంత్రి చెప్పిన 17జోన్లలో విశాఖ జోన్‌ లేదు. దీంతో ఏపీ ఎంపీలే కాదు ప్రజలు సైతం గందరగోళానికి గురయ్యారు. ఈ జోన్‌కు తూర్పు కోస్తా రైల్వేలోని కొత్త రాయగడ డివిజన్‌తో కలిపి రూ.170 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశామని చెప్పారు. 2019 ఆగస్టులోనే దీని డీపీఆర్‌ను సమర్పించినట్లు వెల్లడించారు. తీరా వారం తిరగకుండానే ఆ జోన్ ప్రస్తావన తీసుకురాకపోయేసరికి విభజన హామీ ఇక నెరవేరదని అంతా భావించారు. దీనిపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని ఏపీ ఎంపీలు డిమాండ్ చేశారు.

ఎంపీల ప్రశ్నల వర్షం

దక్షిణకోస్తా రైల్వేజోన్‌ విషయంలో ప్రజలను గందరగోళానికి గురి చేసేలా కేంద్ర ప్రకటన ఉండటంతో శుక్రవారం రాష్ట్ర ఎంపీలు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడు, మిథున్‌రెడ్డి, పోచా బ్రహ్మానందరెడ్డి, గోరంట్ల మాధవ్, బెల్లాన చంద్రశేఖర్, పద్మావతిలు కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించారు. కేంద్రం 2019లో రైల్వే జోన్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు పనుల్లో ఎలాంటి పురోగతి లేదని విమర్శించారు. మూడేళ్లు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం చొరవ చూపడంలేదని ప్రశ్నించారు. 2021-22 బడ్జెట్‌లో దక్షిణ కోస్తా రైల్వేజోన్‌కు కేవలం రూ. 40 లక్షలు మాత్రమే కేటాయించారనీ.. అంత చిన్న మొత్తంతో జోన్ ఏర్పాటు ఎలా సాధ్యమని ఎంపీలు నిలదీశారు.

విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు త్వరలోనే ప్రారంభం

విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయం కార్యకలాపాలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం పనులను వెంటనే ప్రారంభిస్తామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి, లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను పార్లమెంట్‌లోని ఆయన కార్యాలయంలో ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించి ఏళ్ళు గడుస్తున్నా కార్యకలాపాలను ప్రారంభించడంలో జరుగుతున్న జాప్యాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై స్పందించిన రైల్వే మంత్రి వెంటనే విశాఖ రైల్వే జోన్‌ కార్యకలాపాలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని వారు మీడియాకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో పొందుపరచిన హామీలను కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేసేలా తమ పార్టీ చిత్తశుద్ధితో కృషిని కొనసాగిస్తుందని విజయసాయి రెడ్డి, మిథున్‌‌రెడ్డిలు పేర్కొన్నారు. రైల్వే జోన్( దక్షిణ కోస్తా) ఏర్పాటు విషయంలో ఎటువంటి అస్పష్టత లేదని, జోన్ ఏర్పాటుకు ఇప్పటికే చర్యలు ప్రారంభమయ్యాయని, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఇదే విషయాన్ని పార్లమెంటులో స్పష్టంగా చెప్పారని, ఇందులో మరో మాటే లేదని అనకాపల్లి వైసీపీ ఎంపీ సత్యవతి స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాలకు కొత్తగా జోన్‌లు ఇస్తారా.. అని గురువారం లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం వల్ల కొంత గందరగోళం, వక్రీకరణలకు అవకాశం ఏర్పడిందని ఆమె అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed