జులై 1న కార్గిల్, లడఖ్ నేతలతో కేంద్రం భేటీ

by Shamantha N |
జులై 1న కార్గిల్, లడఖ్ నేతలతో కేంద్రం భేటీ
X

న్యూఢిల్లీ: కేంద్రపాలిత ప్రాంతం జమ్ము కశ్మీర్‌లోని పార్టీల నేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భేటీ అయిన తర్వాత తాజాగా, ఇదే తరహా సమావేశానికి కార్గిల్, లడఖ్ నేతలనూ ఆహ్వానించింది. ఇందులో పాల్గొనడానికి మాజీ ఎంపీలు, పౌర సమాజానికి చెందిన ప్రముఖులకూ పిలుపునిచ్చింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సారథ్యంలో ఆయన నివాసంలోనే ఈ సమావేశం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం జమ్ము కశ్మీర్‌కు చెందిన 14 నేతలతో సుమారు మూడున్నర గంటలపాటు చర్చలు జరిపారు. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి పునరుద్ధరించే లక్ష్యంతో స్థానిక పార్టీ నేతలు గుప్కార్ అలయెన్స్‌గా ఏర్పడ్డ సంగతి తెలిసిందే.

ఈ అలయెన్స్‌కు లడఖ్ ప్రజల గురించి మాట్లాడే హక్కు లేదని లడఖ్ ఎంపీ జమయంగ్ నంగ్యపాల్ గతంలో ట్వీట్ చేశారు. రాష్ట్రానికి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత లడఖ్ నేతలు తమ ప్రాంతాన్ని రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ కింద ట్రైబల్ ఏరియాగా గుర్తించాలని డిమాండ్లు చేశారు. లడఖ్‌లో 98 శాతం ప్రజలు గిరిజనులేనని వాదించారు. కేంద్రంతో భేటీలో ఈ డిమాండ్ మళ్లీ వినిపించే అవకాశముంది.

Advertisement

Next Story