నేటి నుంచి అసెంబ్లీ.. 18న బడ్జెట్

by Shyam |   ( Updated:2021-03-15 01:41:39.0  )
Telangana Assembly
X

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు గవర్నర్ తమిళిసై ఉభయసభల నుద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం బీఏసీ సమావేశంలో సభా నిర్వహణ, ప్రాధాన్యలను చర్చిస్తారు. శాసనసభలోకి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, శాసన మండలిలోకి ఎమ్మెల్సీ కవితతోపాటు మరో ముగ్గురు నూతనంగా అడుగు పెట్టబోతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వార్షిక బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఉభయ సభలను ఉద్దేశించి 11 గంటలకు అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. అనంతరం సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏయే అంశాలను చర్చించాలి? దేనికెంత సమయం కేటాయించాలి? తదితరాలపై బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకోనుంది. ఈ నెలాఖరు వరకు సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఈ నెల 18న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాలు సోమవారం గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే మరుసటి రోజుకు వాయిదా పడతాయి. గత సమావేశాల తర్వాత చనిపోయిన సిట్టింగ్ సభ్యులు, మాజీ సభ్యులకు సంబంధించి ప్రభుత్వం సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టనుంది. ఆ రోజు మొత్తం సమావేశాలు వాయిదా పడతాయి. ఈ నెల 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రోజంతా చర్చ జరిగి ఆమోదం పొందే కార్యకలాపాలు జరగనున్నాయి. ఈ నెల 18వ తేదీన బడ్జెట్ సమర్పించడంతో సమావేశాలు వాయిదా పడతాయి. బడ్జెట్ సంబంధ అంశాలను అధ్యయనం చేసుకోడానికి సభకు 19వ తేదీన సెలవు ఉంటుంది. ఈ నెల 20వ తేదీ నుంచి బడ్జెట్‌పై చర్చలతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన పద్దులపై విస్తృత చర్చ జరగనుంది.

ఉభయ సభల్లో కొత్త సభ్యులు

శాసనసభలోకి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు తొలిసారి అడుగు పెడుతున్నారు. శాసనమండలిలోకి నిజామాబాద్ స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన కవిత, గవర్నర్ కోటాలో ఎన్నికైన ముగ్గురు అడుగు పెడుతున్నారు. ఈ ముగ్గురిలో బస్వరాజు సారయ్య మినహా మిగిలినవారంతా కొత్తవారే. వీరంతా ఇప్పటికే సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. చర్చల్లో పాల్గొనడం మాత్రం తొలిసారి.

Advertisement

Next Story

Most Viewed