రాత్రి బాత్రూమ్‌కు వెళ్లిన బాలుడు తిరిగిరాలేదు.. వెళ్లి చూస్తే షాక్..

by Sumithra |
రాత్రి బాత్రూమ్‌కు వెళ్లిన బాలుడు తిరిగిరాలేదు.. వెళ్లి చూస్తే షాక్..
X

దిశ, చార్మినార్ : అనుమానస్పద స్థితిలో ఓ బాలుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చాంద్రాయణగుట్ట ఇన్ స్పెక్టర్ ప్రసాద్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం… హసన్ నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్దుల్ అవైస్ (15) ఫుల్ బాగ్ ప్రాంతంలో ఇస్లామియా అన్వరూల్ ఖురాన్ అనే మదర్సాలో రెండేళ్లుగా అరబి కోర్సు నేర్చుకుంటూ అక్కడే నివసిస్తున్నాడు. దాదాపు 17 మంది ఈ కోర్సులో చేరారు.

మదర్సా పక్కనే నిర్వాహకులు నివసిస్తున్నారు. ఎప్పటి లాగానే శుక్రవారం రాత్రి నిర్వాహకులు విద్యార్థులకు భోజనం పెట్టిన అనంతరం హాస్టల్ కు బయటి నుంచి తాళం వేసి వెళ్లారు. మరునాడు ఉదయం హాస్టల్ తాళం తీసి చూడగా మహ్మద్ అబ్దుల్ అవైస్ బాత్రూమ్ లో షెవర్ కు బెడ్ షీట్ పీస్ తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తోటి విద్యార్థులు నిర్వాహకుడికి తెలిపారు. వెంటనే మదర్సా నిర్వాహకుడు మృతుడి కుటుంబ సభ్యులకు, చాంద్రాయణగుట్ట పోలీసులుకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మదర్సాలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా రాత్రి 10.39 గంటలకు రూమ్ నుంచి ఒంటరిగా మహ్మద్ అబ్దుల్ అవైస్ బాత్రూమ్ లోకి వెళ్లడం మాత్రమే నిక్షిప్తమైంది. తిరిగి బయటికి రావడం కనిపించలేదని పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసును చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story