నో సేల్స్.. 70 శాతానికి పైగా నష్టపోయిన వాహనరంగం

by Shyam |
నో సేల్స్.. 70 శాతానికి పైగా నష్టపోయిన వాహనరంగం
X

దిశ, తెలంగాణ బ్యూరో: బైక్ ప్రతిఒక్కరికీ నేడు నిత్యావసరం. అత్యవసర సమయాల్లో ఎక్కడికైనా వెళ్లాలంటే ద్విచక్రవాహనం తప్పనిసరి. ఇక గ్రేటర్ హైదరాబాద్ వంటి మహానగరంలో ట్రాఫిక్ చిక్కుల నుంచి తప్పించుకుని త్వరగా ఆఫీస్ కు చేరుకోవాలన్నా ఎక్కువ మంది బైక్ కే ప్రియారిటీ ఇస్తారు. పండుగ వేళలు, ఇతర శుభకార్యాల సమయాల్లో ద్విచక్ర వాహనాలు కొనుగోలు ఎక్కువగా జరుగుతుంది. కొందరు కొత్త అల్లుడికి కట్నం కింద బైక్ కొనిస్తూ మురిసిపోతుంటారు. అలాంటి ఎన్నో సందర్భాలకు కరోనా బ్రేకులు వేసింది. కొవిడ్ భయంతో వాహనాలు కొనేందుకు ప్రజలు మొగ్గుచూపడంలేదు. కరోనా కారణంగా ఎవరికి, ఎప్పుడు, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉండటంతో ప్రజలు పొదుపు మంత్రాన్ని పాటిస్తున్నారు. వెహికిల్ అవసరమున్నా సరే కొనుగోలు చేయకుండా పెండింగ్ లో పెడుతున్నారు. ఉపాధి, డబ్బులు లేక కొందరు వాహనాలు కొనేందుకు ఆసక్తి చూపించకపోవడంతో ఇంకొందరు కొవిడ్ వస్తే ఇబ్బందులు తప్పవని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కొనుగోళ్లు చేయడంలేదు. దీంతో వాహనరంగం సంక్షోభంలో పడింది. దాదాపు 70 శాతానికి పైగా నష్టాలు చవిచూసింది. బ్యాంకు లోన్లు, షాపు అద్దె, సిబ్బందికి వేతనం చెల్లించలేక నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు.

కస్టమర్లు లేక వెలవెల

తెలంగాణలో నూతన వాహనాల కొనుగోలుపై కరోనా ఎఫెక్ట్ తీవ్రంగా పడింది. కొనుగోళ్లకు కస్టమర్లు ముందుకురాకపోవడంతో షోరూంలన్నీ వెలవెలబోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు కంపెనీలకు చెందిన వాహన షోరూంల సంఖ్య వందల్లో ఉన్నాయి. అందులో పనిచేసే సిబ్బంది కూడా సంఖ్య వేలల్లో ఉంది. అయితే కరోనాకు ముందు ఒక పేరుగాంచిన షోరూంలో నెలకు కనీసం రూ.5 లక్షల వరకు కొనుగోళ్లు జరిగితే ఇప్పుడు ఒక్క బైక్ కూడాఅమ్మకాలు జరగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నిర్వాహకులు. అయినా అద్దె భారం, సిబ్బందికి వేతనాలు చెల్లించడం తప్పడంలేదని ఆవేదన చెందుతున్నారు. తెలంగాణలో హీరో కంపెనీకి 32 డీలర్ షిప్స్ ఉన్నాయి. అలాగే హోండాకు 40 వరకు, బజాజ్ డీలర్లు 30 వరకు, సుజుకీ కంపెనీకి 20 వరకు, యమహాకు15 వరకు డీలర్లు ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో మార్కెట్ ను బట్టి కంపెనీలు డీలర్ షిప్స్ ఇస్తుంటాయి. అయితే వీటన్నింటి పరిస్థతి ఒకేలా ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. అందరూ ఆర్థిక నష్టాలతో సతమతమవుతున్నారు.

కొవిడ్ భయంతో మొగ్గుచూపని జనం

ప్రపంచ దేశాలను సైతం కరోనా వైరస్ కుదిపేసింది. ఎంతో మంది ప్రజలు వైరస్ బారిన పడి మరణించారు. చాలామంది కరోనాతో పోరాడి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇంకా నేటికీ లక్షల్లో జనం చికిత్స పొందుతున్నారు. ఇలాంటి భయాలన్నీ చూసిన జనం భవిష్యత్ లో తమకేమైనా జరిగితే ఎలా అనే సందిగ్ధంలో పడ్డారు. బైక్ వారికి అత్యవసరమైనప్పటికీ ఏదైనా ఇబ్బంది తలెత్తితే ఎలా అని అందరూ పొదుపు మంత్రాన్ని పాటిస్తున్నారు. ఎలాంటి కొనుగోళ్లు జరపకపోవడంతో వాహనరంగం తీవ్రంగా నష్టపోయింది. కొందరు ప్రజలైతే తినడానికి తిండి లేకుండా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఈఎంఐల్లో బైక్ కొనుగోలు చేసిన కస్టమర్లు ప్రతినెలా వాయిదాలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారికి ఫైనాన్స్ ఇచ్చిన కంపెనీల వేధింపులు ఎక్కువయ్యాయి. ఇలాంటి క్లిష్ట సమయాల్లో బైక్ కొనకపోవడమే ఉత్తమమని నిర్ణయానికి వచ్చేశారు ప్రజలు. బతికుంటే భవిష్యత్ లో ఎన్నో తీసుకోవచ్చనే భావనలో జనం ఉన్నారు.

నిర్వాహకులపై అద్దె భారం

వాహనాల షోరూం నిర్వాహకులపై అద్దె భారం భారీగా పడింది. బైక్స్ స్టోరేజ్ చేసుకునేందుకు షోరూంతో పాటు, ఇతర ప్రాంతాల్లో గోడౌన్లు కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అవన్నీ కమర్షియల్ భవనాలు కావడంతో అద్దె సైతం వేలల్లోనే ఉంటోంది. కరోనా ఫస్ట్ వేవ్ నుంచి కస్టమర్లు లేక వాహనాలు కొనేవారు కరువవ్వడంతో నిర్వాహకులు ఆర్థికంగా నష్టపోయారు. దీనికి తోడు అద్దె చెల్లించేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆలస్యం చేస్తే కొందరు యజమానులు ఖాళీ చేయమని చెబుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల రెండు, మూడు నెలల అద్దె ఒకసారి చెల్లిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా మెయింటెనన్స్ ఖర్చులు కూడా నిర్వాహకులను వేధిస్తున్నాయి.

సిబ్బంది వేతనాల్లో కోత

వాహనాల కొనుగోళ్లు లేకపోవడంతో సిబ్బంది వేతనాలు, బ్యాంకుల్లో తీసుకున్న రుణం చెల్లించేందుకూ నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. ఫస్ట్ వేవ్ సమయంలో కొన్ని నెలలపాటు పూర్తి వేతనం ఇచ్చినా తర్వాత పరిస్థితులు మరింత క్లిష్టంగా మారిపోవడంతో పలుచోట్ల యాజమాన్యం సిబ్బంది వేతనాల్లో కోత విధించింది. సిబ్బంది పోతే నమ్మకస్తులు దొరకరనే భావనతో నల్లగొండ, వరంగల్, జనగామ, ఇతర జిల్లాలకు చెందిన నిర్వాహకులు ప్రతినెలా ఎంతో కొంత ముట్టజెప్పారు. కనీసం రెండు నెలలకోసారైనా కొంత ఇస్తూ వారి అవసరాలను తీర్చినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. అయితే వేతనాల్లో కోత ఉద్దేశ్యపూర్వకంగా జరిగింది కాదని, తప్పనిసరి పరిస్థితుల్లోనే కోత విధించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. తమ బాధలు కూడా చూడాలని వారు ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉండగా నల్లగొండ జిల్లాకు చెందిన ఒక షోరూం యజమాని అయితే ఫస్ట్ వేవ్ సమయంలో దాదాపు మూడు నెలల పాటు ప్రతినెలా తన వద్ద పనిచేసే సిబ్బందికి బియ్యం, నిత్యావసరాలు అందించి అండగా నిలిచాడు. సిబ్బందితో పాటు అత్యవసర సేవలందించిన వారికి, పేదలకు సైతం అందించాడు. ఇందుకు దాదాపు రూ.2 లక్షలు వెచ్చించాడు. కరోనా ప్రభావం ఇన్నిరోజులు ఉంటుందని తెలియకపోవడంతో ఎంతో మందికి చేయూతనందించాడు. ఇప్పుడు వాహనాలు కొనుగోలు జరగక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.

సిబ్బందికి కొవిడ్ భయం

ద్విచక్రవాహనాల్లో పనిచేసే సిబ్బందికి కొవిడ్ భయం పట్టుకుంది. ప్రతిరోజు సర్వీసింగ్, వాహనాలు, ఇతర స్పేర్ పార్ట్స్ కోసం ఎందరో వస్తుంటారు. వారికి వైరస్ ఉంటే తమకెక్కడ అంటుకుంటుందోనని భయంతో సిబ్బంది కాలం గడుపుతున్నారు. తమ నుంచి ఇంట్లో వారికి సోకితే మరింత ప్రమాదకరమని ఆందోళనలో ఉన్నారు సిబ్బంది. ఫస్ట్ వేవ్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది సిబ్బంది కొవిడ్ బారిన పడినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ప్రాణాలు విడిచిన వారి సంఖ్య మాత్రం తక్కువగానే ఉన్నట్లు వారు చెప్పారు. కొవిడ్ విజృంభించిన సమయంలో స్టాఫ్ కూడా పనిచేసేందుకు సహకరించలేదని, అందరూ ప్రాణ భయంతో వారి స్వగ్రామాలకు వెళ్లినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed