- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో సమ్మర్, వింటర్ క్యాపిటల్స్ ఏర్పాటు చేయండి.. జగన్‌కు బంపరాఫర్
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో మూడు రాజధానుల అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. అసెంబ్లీలో మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టడం.. కొత్త బిల్లును ప్రవేశపెడతామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించడంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాలపై టీజీ వెంకటేశ్ పెదవి విరిచారు. కర్నూలులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాయలసీమ హక్కుల వేదిక సమ్మర్ క్యాపిటల్, వింటర్ క్యాపిటల్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
రాజధాని సమస్యకు వైసీపీ ప్రభుత్వమే కారణమని..అమరావతి రైతులకు జగన్ ఎలాంటి భరోసా ఇవ్వకుండా అభివృద్ధి వికేంద్రీకరణతో ముందుకు వెళ్లడం వల్లే అసలు సమస్య మొదలైందని చెప్పుకొచ్చారు. మూడు రాజధానులపై మళ్లీ చట్టం చేసి కోర్టుకు వెళ్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని, అమరావతినే రాజధానిగా ఉంచి అభివృద్ధి చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి చేస్తున్న ప్రకటనలు గందరగోళంగా ఉంటున్నాయని.. దీని ఫలితం పాలనపై చూపిస్తుందని తెలిపారు.
కర్నూలులో మినీ సచివాలయం ఏర్పాటు చేయాలి..
మూడు రాజధానులు కాకుండా ఒక చోట సెక్రటేరియట్, మరోచోట శీతాకాల సమావేశాలు, ఇంకోచోట వేసవికాల సమావేశాలు నిర్వహిస్తే సమస్య పరిష్కారం అవుతుందని సూచించారు. అంటే అమరావతిని రాజధానిగా ఉంచి, కర్నూలులో వేసవి లేదా శీతాకాల రాజధాని పెట్టాలని రాయలసీమ ఐక్యవేదిక మొదటి నుంచి డిమాండ్ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అశోకుడి పాలనలో కర్నూలు జిల్లాలోని జొన్నగిరి రాజధానిగా ఉండేదని, తమ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని శ్రీకృష్ణ కమిటీకి తెలియజేసిన విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాదు తక్షణమే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఆ తర్వాత హైకోర్టు ఏర్పాటుకు ప్రయత్నించాలని లేకపోతే రెండూ తరలిపోయే ప్రమాదం ఉందని చెప్పుకొచ్చారు. విశాఖలో సెక్రటేరియట్ పెడితే తమ ప్రాంతానికి దూరం అవుతుందని.. అందువల్ల కర్నూలులో కూడా మినీ సచివాలయం ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు. రైతులు, భూములు పోగొట్టుకున్న వారికి న్యాయం చేయాలని సీఎం వైఎస్ జగన్‌ను కోరారు. తన సలహాలు వింటే ఈ విషయంలో బీజేపీని ఒప్పించే బాధ్యత తాను తీసుకుంటానని టీజీ వెంకటేశ్ ప్రకటించారు. అలా కాకుండా జగన్ చెప్పిన మాట ప్రకారం 3 రాజధానుల బిల్లు మళ్లీ పెడతామని అంటే మళ్లీ కోర్టు కేసులు తప్పవు అని టీజీ వెంకటేశ్ హెచ్చరించారు.
మాకు రీజియన్ డెవలప్మెంట్ కావాలి..
‘కర్నూలు ప్రాంతం నుంచి సోలార్, విండ్ ద్వారా మొత్తం సౌత్ ఇండియాకు కరెంట్ ఇస్తున్నాం. రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయండి. మా ప్రాంతం నుంచి రాజధాని పోయింది. మాకు బాధగా ఉంది. మాకు రీజినల్ డెవలప్‌మెంట్ కావాలి. భూములు కోల్పోయిన వారికి అమరావతి రాజధాని అని చెప్పి, మిగతా ప్రాంతాలను అభివృధ్ధి చేయండి. అమరావతినే రాజధానిగా ఉంచండి. పేరు ఏదైనా పెట్టుకోండి గానీ, అభివృద్ధి మాత్రం చేయండి. ఇప్పటికైనా సీఎం జగన్ తన సూచనలు తీసుకోవాలి’ అని టీజీ వెంకటేశ్ కోరారు.