ఆ మూడు నగరాల్లో ‘టెస్లా’ అతిపెద్ద షోరూమ్‌లు

by Harish |
ఆ మూడు నగరాల్లో ‘టెస్లా’ అతిపెద్ద షోరూమ్‌లు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనా తయారీ సంస్థ టెస్లా భారత్‌లో మూడు ప్రధాన నగరాల్లో తన షోరూమ్‌లను తెరవాలని ప్రయత్నిస్తోంది. దీనికోసం అనువైన ప్రదేశాల కోసం, వ్యాపార ప్రయత్నాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఓ ఎగ్జిక్యూటివ్‌ను కూడా నియమించినట్టు తెలుస్తోంది. ఎలన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా మోటార్స్ ఇండియా ఈ ఏడాది జనవరిలో భారత్‌లో సంస్థను నమోదు చేశారు. అలాగే, తన సెడాన్ మోడల్ 3 కారును 2021 రెండో త్రైమాసికానికి విక్రయించాలని లక్ష్యాన్ని నిర్దేశించినట్టు వెల్లడించింది. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరులో 20,000 నుంచి 30,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన భవనాల కోసం టెస్లా సంస్థ అన్వేషిస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

అలాగే, ఇన్వెస్ట్ ఇండియా మాజీ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసిన మనుజ్ ఖురానాను టెస్లా తన విధానాలు, వ్యాపార అభివృద్ధికి మొదటి నియామకంగా తీసుకున్నారు. అయితే, దీనిపై టెస్లా మోటార్స్ ఇండియా స్పందించేందుకు నిరాకరించింది. సాధారణంగా మెట్రో నగరాల వంటి ఖరీదైన ప్రాంతాల్లో లగ్జరీ కార్ల షోరూమ్‌ల కోసం 8,000 నుంచి 10,000 చదరపు అడుగుల మధ్య మాత్రమే నిర్వహిస్తున్నాయి. భారత్‌లోని చాలా షోరూమ్‌లు చిన్నవిగానే ఉంటాయి. ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో వాణిజ్య భవనాల ధరలు కూడా భారీగానే ఉంటాయి. అయితే, ప్రస్తుతానికి భిన్నంగా టెస్లా భారీ స్థలాల్లో షోరూమ్‌ల ఏర్పాటుకు సిద్ధపడుతుండటం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed