భారత్‌లో టెస్లా కార్లు!

by Harish |
భారత్‌లో టెస్లా కార్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ప్రత్యేకత కలిగిన సంస్థ టెస్లా… ఎలన్ మస్క్ సారథ్యంలో ఈ కంపెనీ త్వరలో భారత మార్కెట్లోకి ప్రవేశించే అవకాశాలను కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి టెస్లా కంపెనీ ఈ నెల ప్రారంభంలో కర్ణాటక ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపినట్టు సమాచారం. బెంగళూరులో పరిశోధన సౌకర్యం కోసం టెస్లా కంపెనీ చూస్తోందని, దీనికోసం స్థానిక అధికారులు కూడా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ నెల చివర్లో మరొకసారి సమావేశం అనంతరం టెస్లా కంపెనీ పెట్టుబడుల ప్రతిపాదనను అధికారులు పరిశీలించనున్నారు.

టెస్లా కంపెనీ సైతం కర్ణాటకలో పరిశోధనా, ఆవిష్కరణ కేంద్రంగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తోందని, చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నట్టు సమాచారం. ఒకవేళ ఈ చర్చలు విజయవంతమైతే టెస్లా పరిశోధనా కేంద్రాన్ని కలిగి ఉన్న రెండో దేశంగా అమెరికా తర్వాత భారత్ నిలవనుంది. ఈ ఏడాది జులైలో లగ్జరీ ఎలక్ట్రిక్ వాహనాలు త్వరలో భారత్‌కు వస్తాయని టెస్లా సీఈవో ఎలన్ మస్క్ చెప్పిన సంగతి తెలిసిందే. టెస్లాతో పాటు అనేక ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలకు బెంగళూరు హాట్‌స్పాట్‌గా మారింది.

ప్రస్తుతం ఈ ప్రాంతం నుంచి మహీంద్రా ఎలక్ట్రిక్, దైమ్లర్, బోష్ వంటి స్థానిక ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఓలా ఎలక్ట్రిక్, సన్ మొబిలిటీ, ఈథర్ కంపెనీలు కూడా కర్ణాటక ప్రాంతానికి చెందినవే. దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీతో ముందుకొచ్చిన మొదటి రాష్ట్రం కర్ణాటక కావడమే దీనికి కారణం. ఈ రాష్ట్రం తర్వాతే ఇతర 11 రాష్ట్రాలు స్వంత విధానాలతో ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీలతో ముందుకొచ్చాయి. కాగా, భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫైనాన్షియల్ సేవల సంస్థ అవెండస్ ప్రకారం.. 2025 నాటికి భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ రూ. 50 వేల కోట్లకు చేరుకోవచ్చని నివేదిక వెల్లడించింది.

Advertisement

Next Story