విద్యాశాఖ అధికారుల్లో టెన్షన్.. ‘మిడ్ డే మీల్స్‌’ అమలు కష్టమేనా.?

by Anukaran |   ( Updated:2021-08-28 02:56:07.0  )
Midday Mills
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలయ్యేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో మధ్యాహ్న భోజనం ఏర్పాటుచేసేందుకు వంట మనుషులు ముందుకు రావడం లేదు. 45 రోజుల బిల్లులను, నెలవారి జీతాలను చెల్లించకపోవడంతో మధ్యాహ్న భోజనం నిర్వహించేందుకు వారు నిరాకరిస్తున్నారు. ఎప్పుడు ఉపాధి ఉంటుందో.. ఎప్పుడు ఉండదోననే పరిస్థితుల్లో.. పనిచేసేందుకు వారు సుముఖత చూపడం లేదు. తమ సమస్యలను పరిష్కరించి క్రమం తప్పకుండా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు ప్రారంభం కానుండటంతో విద్యాశాఖ అధికారులు ఆలోచనలో పడ్డారు.

సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు ప్రారంభం కానుండటంతో అధికారుల్లో మధ్యాహ్న భోజన నిర్వహణపై ఆందోళనలు మొదలయ్యాయి. మిడ్ డే మీల్స్ ఏర్పాటు చేసేందుకు వంట మనుషులు ముందుకు రాకపోవడంతో ఉపాధ్యాయులు అయోమయంలో పడ్డారు. బిల్లులను, జీతాలను చెల్లించే విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లేకపోవడంతో వారు మందుకు రావడం లేదు. థర్డ్ వేవ్ ప్రారంభమైతే మునుపటి పరిస్థితులే నెలకొంటాయని తిరిగి బిల్లులు చెల్లించరని వంట మనుషులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

45 రోజుల పాటు ఫిజికల్ తరగతులు..

ఫస్ట్ వేవ్ కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం ఫిబ్రవరిలో ఫిజికల్ తరగతులను ప్రారంభించింది. ఫిబ్రవరి 1 నుంచి 9,10 తరగతులకు కాస్లులు ప్రారంభించగా.. 6,7,8 తరగతుల విద్యార్థులకు ఫిబ్రవరి 24 నుంచి క్లాసులు ప్రారంభించారు. మార్చి 23 వరకు మొత్తం 45 రోజుల పాటు ఫిజికల్ క్లాసులను నిర్వహించగా కరోనా ప్రభావం పెరగడంతో తిరిగి పాఠశాలలను మూసివేసి ఆన్ లైన్ తరగతులను స్టార్ట్ చేశారు. ఫిజికల్ తరగతులను నిర్వహించినన్ని రోజులు పాఠశాలలో విద్యార్థులకు క్రమం తప్పకుండా మధ్యాహ్న భోజనాన్ని అందించారు.

బిల్లులు, వేతనాలను చెల్లించని ప్రభుత్వం..

ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేసేందుకు వంట మనుషులు మందుకు రావడం లేదు. ఫిజికల్ తరగతులు నిర్వహించిన 45రోజుల బిల్లులను ప్రభుత్వం ఇప్పటి వరకూ చెల్లించలేదు. వీటితో పాటు పాఠశాలలు మూతపడినప్పటి నుంచి నెలకు అందించే రూ.1000 జీతాలను కూడా ప్రభుత్వం మంజూరుచేయలేదు. ఈ ప్రభావంతో ప్రస్తుతం ప్రారంభంకాబోతున్న పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేసేందుకు వంట మనుషులు ముందుకు రావడం లేదు.

మెనూ ప్రకారం మిడే మీల్స్ నిర్వహణ..

ప్రభుత్వం అందించిన మెనూ ప్రకారం పాఠశాలలో వంట మనుషులు మిడ్ డే మీల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. సర్కార్.. ప్రాథమిక పాఠశాలలో ఒక్కో విద్యార్థికి రూ.4.97లను, అప్పర్ హైస్కూ‌ల్‌లో ఒక్కో విద్యార్థికి రూ. 7.45లను చెల్లిస్తున్నది. విద్యార్థులకు సోమవారం గుడ్డు, సాంబర్, మంగళవారం కూరగాయలు, బుధవారం పప్పు, గుడ్డు, కూరగాయలు, గురువారం సాంబార్, శుక్రవారం నాడు కూరగాయలు, గుడ్డు, శనివారం పప్పు, కూరగాయలు అందించాల్సి ఉంటుంది. గుడ్డు వడ్డించిన రోజు అధనంగా ఒక్కో విద్యార్థికి రూ. 2 చెల్లిస్తున్నది.

Advertisement

Next Story