యాదాద్రి కలెక్టరేట్‌ ముట్టడిలో ఉద్రిక్తత.. బీజేపీ నేతకు రక్తపు మరకలు

by Sridhar Babu |   ( Updated:2021-07-27 07:00:43.0  )
యాదాద్రి కలెక్టరేట్‌ ముట్టడిలో ఉద్రిక్తత.. బీజేపీ నేతకు రక్తపు మరకలు
X

దిశ, భువనగిరి రూరల్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన లక్ష రూపాయల రుణమాఫీ హామీని వెంటనే అమలు చేయాలని, అదే విధంగా ఫసల్ బీమా యోజన పథకాన్ని కూడా రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని రాష్ట్ర కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తలపెట్టిన కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. తొలుత జిల్లా కేంద్రంలోని వ్యవసాయ కమిషనరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆ తరువాత కలెక్టర్ కార్యాలయం ముందు భైఠాయించారు. ఇదే సమయంలో పోలీసుల మోహరించడంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పోచంపల్లికి చెందిన కౌన్సిలర్ సురకంటి రంగారెడ్డికి గాయాలు అయ్యాయి. దీంతో హుటాహుటిన ఏరియా హాస్పిటల్‌కి తరలించారు. ఈ సంఘటనతో కాసేపు కలెక్టర్ కార్యాలయం ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్ మోహన్ రెడ్డి, బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ నర్సింగ్ రావు, పట్టణ అధ్యక్షుడు ఉమా శంకర్ రావు, శ్రీశైలం, సంతోష్ రెడ్డి, కిసాన్ మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story