సీఎం జగన్ ఇంటి వద్ద టెన్షన్ టెన్షన్

by srinivas |
సీఎం జగన్ ఇంటి వద్ద టెన్షన్ టెన్షన్
X

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేసిన క్యాలెండర్‌ను రద్దు చేసి కొత్త జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, నిరుద్యోగ, ప్రజా సంఘాలు, టీడీపీ అనుబంధ సంఘాలు పిలుపునిచ్చిన సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది. సీఎం జగన్ ఇంటి ముట్టడికి తెలుగు యువత, టిఎన్ఎస్ఎఫ్‌తో పాటు ఎస్ఎఫ్ఐ, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ సంఘాలు ర్యాలీగా బయలుదేరాయి. దీంతో ఆందోళనకారులను తాడేపల్లి పాత టోల్‌గేట్ జంక్షన్ వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నాయకులను గవర్నర్ పేట, నున్న, అజిత్‌సింగ్ నగర్, విజయవాడ వన్‌టౌన్, సత్యనారాయణపురం, నల్లపాడు పోలీసు స్టేషన్‌లకు తరలించారు. దీంతో తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

డ్రోన్లతో నిఘా

చలో తాడేపల్లి కార్యక్రమంలో భాగంగా పోలీసులు డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలతో పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. సీఎం జగన్ నివాసానికి వెళ్లే మార్గంలో ముగ్గురు ఎస్పీలు, డీఎస్పీలు సహా సుమారు వెయ్యి మంది పోలీసులను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఆందోళనకారులను ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు భారీగా మోహరించారు. సీసీ కెమెరాలు, డ్రోన్ల సాయంతో ఆందోళన కారుల వివరాలను కంట్రోల్ రూమ్ నుంచి పోలీసులకు చేరవేస్తున్నారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.

నల్లపాడు పీఎస్‌లో ఆందోళనకారుల నినాదాలు

సీఎం జగన్ ఇంటికి ర్యాలీగా బయలుదేరిన ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని గుంటూరు జిల్లా నల్లపాడు పీఎస్‌కు తరలించారు. నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో సైతం ఆందోళనకారులు తమ నిరసనను తెలియజేస్తున్నారు. తెలుగు యువత నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్రమ అరెస్టులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మరోవైపు టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

Advertisement

Next Story

Most Viewed