జగన్ సర్కార్ విద్యుత్ ఛార్జీల పెంపుపై యనమల సెటైర్లు

by Vinod kumar |
జగన్ సర్కార్ విద్యుత్ ఛార్జీల పెంపుపై యనమల సెటైర్లు
X

దిశ, ఏపీ బ్యూరో: 'విజనరీ నాయకుడికి.. ప్రిజనరీకి ఉన్న తేడా చెప్పడానికి నేడు పెంచిన విద్యుత్ ధరలే ప్రత్యక్ష నిదర్శనం. ఐదేళ్ల పాలనలో ఒక్క సారి కూడా విద్యుత్ ధరలు పెంచకపోగా.. మిగులు విద్యుత్ సాధించడం చంద్రబాబు నాయుడి విజన్ అయితే.. విద్యుత్ ఉత్పత్తి లేక ధరలు పెంచడం నేటి ప్రిజనరీ పనికిమాలిన విధానం. గతంలో దారిద్ర రేఖ దిగువన ఉన్న జనాభా సంఖ్య తగ్గించేందుకు ప్రయత్నించాం. నేడు జగన్ రెడ్డి వీలైనంత మందిని దారిద్ర్య రేఖ దిగువకు నెట్టడమే పనిగా పెట్టుకున్నారు' అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు.

'ప్రజలపై భారాలు వేయడం, వారి నడ్డి విరగ్గొట్టడమే ధ్యేయంగా జగన్ రెడ్డి మూడేళ్ల పాలన సాగింది. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఒక్కసారి కూడా ధరలు పెంచకున్నా.. బాదుడే బాదుడు అంటూ సభలు.. సమావేశాల్లో దీర్ఘాలు తీసిన జగన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఏడు సార్లు ధరలు పెంచి 1.72 కోట్ల మందికి విద్యుత్ షాక్ ఇచ్చారు. ఇప్పటికే స్లాబుల మార్పుతో రూ.11,600 కోట్ల భారం మోపిన జగన్ రెడ్డి.. ఇప్పుడు మరో రూ.4,400 కోట్ల బాదుడుకు సిద్ధమయ్యారు' అని యనమల ధ్వజమెత్తారు.

పేదలపై కపట ప్రేమ చూపొద్దు..

2014-2019 మధ్య కాలంలో వాడిన విద్యుత్తుకు సర్దుబాటు పేరుతో భారీగా ప్రజల్ని పిండేలా ప్లాన్ చేసుకోవడం అత్యంత దుర్మార్గం. సగటు వినియోగం ఆధారంగా కేటగిరీ నిర్ణయించే పద్ధతి రద్దు చేసి.. నెలవారీ కేటగిరీ నిర్ణయించే కొత్త విధానాన్ని తీసుకొచ్చి పేద, దిగువ మధ్య తరగతి ప్రజలపై మోయలేని భారం వేస్తున్నారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకునే పేద, మధ్య తరగతి ప్రజలపై 45 శాతానికి పైగా ధరలు పెంచిన జగన్ రెడ్డి.. 400 యూనిట్ల పైబడి విద్యుత్ వాడే ధనిక వర్గాలపై మాత్రం కేవలం 6 శాతం(55 పైసలు) మాత్రమే ధరలు పెంచడం ద్వారా పేదలపై తన కపట ప్రేమ బయట పెట్టుకున్నారు' అంటూ యనమల మండిపడ్డారు.

'నాడు.. చంద్రబాబు నాయుడి ముందు చూపుతో సోలార్, విండ్ విద్యుత్ కొనుగోళ్లకు ఒప్పందాలు కుదుర్చుకుని భవిష్యత్తులో విద్యుత్ కష్టాలు లేకుండా చేశారు. జగన్ రెడ్డి తన సహజమైన విధ్వంసం, వికృత ఆనందపు చర్యలతో ఆ ఒప్పందాలు రద్దు చేసుకోవడం కారణంగానే నేడు అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. వేసవి కాలంలో సాధారణంగానే విద్యుత్ వినియోగం పెరుగుతుంది. అలాంటి పరిస్థితుల్ని ముందుగా అంచనా వేసి.. విద్యుత్ సర్దుబాటు చేసుకోవాల్సింది పోయి.. అధిక ధరలకు కొంటున్నామన చెబుతూ ఆ భారాన్ని ప్రజల నెత్తిన వేయడం సిగ్గుచేటు.

ప్రజలు మద్యం తాగి ప్రాణాలు కోల్పోకుండా చేసేందుకే మద్యం ధరలు పెంచామన్న జగన్ రెడ్డి.. నేడు విద్యుత్ ధరలు పెంపు కూడా ప్రజల మంచి కోసమే అనేలా ఉన్నారు. ఏదైనా ప్రభుత్వంలో ఏయే వస్తువుల ధరలు పెరిగాయో చూసుకునే పరిస్థితి నుండి.. ఏ రంగాలపై బాదుడు వేయలేదో చూసుకునే పరిస్థితికి జగన్ రెడ్డి రాష్ట్రాన్ని దిగజార్చారు' అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed