తల్లి పాలను డెయిరీ ప్రొడక్ట్స్ కింద అమ్ముకోవచ్చా?

by Manoj |
తల్లి పాలను డెయిరీ ప్రొడక్ట్స్ కింద అమ్ముకోవచ్చా?
X

దిశ, ఫీచర్స్ : తల్లి పాలను డెయిరీ ప్రొడక్ట్‌గా అమ్ముకోవచ్చా? బెంగళూరు బేస్డ్ కంపెనీ చేస్తున్న పని.. నవజాత శిశువుల జీవితాలతో ఆడుకుంటోందా? అసలు లాభాల కోసం భారీ ధరకు తల్లి పాలను విక్రయించేందుకు అనుమతించింది ఎవరు? ఏ రూపంలో ఇచ్చారు? లాభాపేక్షతో బ్రెస్ట్ మిల్క్ వ్యాపారం చేస్తున్న ఆసియాలోనే మొదటి సంస్థ.. తన బిజినెస్ ప్లేస్ ఎందుకు మార్చినట్లు? కంబోడియాలో చెక్ పెడితే ఇండియాను స్థావరంగా చేసుకున్న ఆ అమెరికన్ కంపెనీ కథేంటి? ఎందుకు వ్యతిరేకత ఏర్పడుతోంది?

బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ అంటే..?

బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్‌ను కాంప్రెహెన్సివ్ లాక్టేషన్ మేనేజ్మెంట్ సెంటర్స్‌, లాక్టేషన్ మేనేజ్మెంట్ యూనిట్స్‌గా కూడా పిలుస్తుంటారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా స్థాపించబడిన ఈ మిల్క్ బ్యాంక్స్.. తల్లులు పాలు ఇవ్వలేనప్పుడు అనారోగ్యంతో ఉన్న, నెలలు నిండని శిశువులకు పాలు అందించేందుకు ఏర్పడ్డాయి. ప్రస్తుతం భారతదేశంలో 80కి పైగా లాభాపేక్షలేని బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్ ఉండగా.. ఇవన్నీ కూడా డొనేషన్ బేస్డ్. పేదలకు తల్లిపాలను ఉచితంగా అందించే ఈ సెంటర్స్.. రిచ్ పీపుల్‌ నుంచి మాత్రం డబ్బులు వసూల్ చేస్తుంటాయి. ప్రభుత్వ ఆసుపత్రులకు అనుబంధంగా ఉంటూ అవసరమైన వారికి ఉచితంగా పాలను అందిస్తాయి.

2018 ఇండియాస్ పాలసీ అండ్ ప్రోగ్రామ్స్ ఆన్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ ఇన్‌ఫాంట్ అండ్ యంగ్ చైల్డ్ ఫీడింగ్ ప్రకారం.. సంస్థాగత ప్రసవాలు మెరుగుపడ్డాయి. కానీ భారతదేశంలో పుట్టిన 10 మంది శిశువుల్లో ఆరుగురు పుట్టిన గంటలోపు తల్లి పాలు తాగలేకపోతున్నారు. అనివార్య కారణాల వల్ల తల్లి పాలు ఇవ్వలేకపోతోంది. అలాంటప్పుడు వీరికి బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ మాత్రమే సోర్స్‌గా ఉంటుంది. శిశువు జీవితంలో మొదటి 6 నెలల వరకు తల్లి పాలు మాత్రమే పోషకాహారానికి మూలం. కాగా పుట్టిన వెంటనే బిడ్డకు అందించే పాలల్లో పోషకాలు, యాంటీబాడీస్ పుష్కలంగా ఉంటాయి. ఒకవేళ ఇవి అందలేకపోతే.. జీవితాంతం అనారోగ్యాలు వెంటాడుతుంటాయి.

యూనిసెఫ్ ఇండియా ప్రచురించిన నివేదిక ప్రకారం అధి, తక్కువ-ఆదాయ దేశాల్లోని తల్లులు.. పూర్ హెల్త్ కేర్ అండ్ న్యూట్రిషన్‌తో బాధపడుతున్నారని తేలింది. దీంతో బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే పాలు ఉత్పత్తి కాకపోవడంతో.. పిల్లలకు తేనె లేదా పంచదార కలిపిన నీటిని మొదటి ఫీడ్‌(ప్రీలాక్టీల్ ఫీడ్)గా అందిస్తున్నారు. అయితే ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తున్న తల్లి పాల బ్యాంకులు.. పాలను దానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి కొత్త తల్లులను ఒప్పించడంలో సాయపడతాయి. ఇందుకోసం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ.. 'మదర్స్ అబ్సల్యూట్ ఆప్షన్' 'వాత్సల్య -మాత్రి అమృత్ కోష్' పేరుతో నార్వే ప్రభుత్వంతో కలిసి అవగాహనా కార్యక్రమాలు చేపట్టింది.

తల్లిపాలు లాభాపేక్ష కోసం అమ్ముకోవడం కరెక్టా?

భారత్, కంబోడియా, యూఎస్, ఇంగ్లండ్‌ సహా ప్రపంచవ్యాప్తంగా తల్లి పాల వాణిజ్యీకరణ ప్రజాదరణ పొందింది. ఇలాంటి ఒక తల్లి పాల కంపెనీ.. ఆరు 50ml బాటిళ్లను దాదాపు రూ. 4,300కు విక్రయిస్తోంది. ఈ లాభసాటి వ్యాపారానికి ప్రధానంగా పేద మహిళలే దాతలు. ఇలా సహజంగా ఉత్పత్తయ్యే పాలను వ్యాపార సరుకుగా మారుస్తున్నాయి కంపెనీలు.

నియోలాక్టా లైఫ్‌సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్:

2016లో స్థాపించబడిన నియోలాక్ట్ మొదటగా FSSAI కర్ణాటక కార్యాలయం నుంచి పాల ఉత్పత్తుల విభాగంలో లైసెన్స్‌ పొందింది. కంబోడియా తల్లిపాల విక్రయాన్ని నిషేధించిన తర్వాత ఈ కంపెనీ ప్రారంభించబడింది. అమెరికాకు చెందిన లాభాపేక్షతో కూడిన కంపెనీ అంబ్రోసియా.. కంబోడియాలోని పేద మహిళల నుంచి తల్లి పాలను సోర్సింగ్ చేసి యూఎస్‌లో విక్రయిస్తుండటంతో ఈ కమర్షియలైజేషన్‌కు వ్యతిరేకంగా దేశ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. తల్లి పాల వ్యాపారం హానికరమని, పేద మహిళలను వాణిజ్య ప్రయోజనాల కోసం దోపిడి చేస్తోందని యునిసెఫ్ కూడా ప్రకటించింది. ఫ్రీజ్ చేయబడిన పాలు లేదా తల్లి పాల పొడిని విక్రయించే ఈ సంస్థ.. 300 మిల్లీ లీటర్లకు రూ.5 వేల వరకు వసూల్ చేస్తోంది.

కంబోడియాలో బ్యాన్ చేశాక ఇండియాలో కార్యకలాపాలు నిర్వహించడంపై సోషల్ యాక్టివిస్ట్స్ ఆందోళనకు దిగారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) మంజూరు చేసిన లైసెన్స్‌పై ఈ కంపెనీ తల్లి పాలను వాణిజ్యీకరించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే చేపట్టిన తనిఖీల్లో ఇది నిజమని తేలగా లైసెన్స్ రద్దు చేసిన FSSAI.. మార్గదర్శకాల ప్రకారం తల్లి పాలను అమ్మేందుకు అనుమతించమని పేర్కొంది. అయితే 2021లో మంజూరు చేయబడిన ఆయుష్ లైసెన్స్ ద్వారా కంపెనీ 'నారీక్షీర' అనే కొత్త పేరుతో ఉత్పత్తిని తిరిగి ప్రవేశపెట్టింది.

Advertisement

Next Story

Most Viewed