RG Kar: పోలీసు కస్టడీలో మహిళపై చిత్రహింసలు.. సిట్ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశాలు

by vinod kumar |
RG Kar: పోలీసు కస్టడీలో మహిళపై చిత్రహింసలు.. సిట్ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ ఆస్పత్రి (RG kar Hospital)లో ట్రైనీ డాక్టర్‌పై లైంగిక దాడి, హత్య కేసుకు సంబంధించిన కేసును సుప్రీంకోర్టు (Supreme court) సోమవారం విచారించింది. ఈ ఘటనపై నిరసన సందర్భంగా అరెస్టైన మహిళను పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారనే ఆరోపణలున్నాయి. దీంతో ఈ కేసులో సిట్ దర్యాప్తునకు న్యాయస్థానం ఆదేశించింది. అన్నింటినీ సీబీఐకి బదిలీ చేయడం సాధ్యం కాదని గమనించిన జస్టిస్ సూర్యకాంత్ (Suryakanth) , జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ (Ujjal bhuyan)లతో కూడిన ధర్మాసనం కలకత్తా హైకోర్టు ఆదేశాలను సైతం సవరించింది. విచారణను రాష్ట్రంలోని సీనియర్ ఐపీఎస్ అధికారులకు అప్పగించాలని తెలిపింది. ప్రభుత్వం పేర్కొన్న అధికారులను సిట్‌లో చేర్చాలని, ఈ బృందం ప్రతి వారం తమ నివేదికను హైకోర్టుకు అందజేయాలని ఆదేశించింది. ఈ విషయంలో ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సూచించింది. ఈ ధర్మాసనం ఎదుట సిట్ నివేదిక అందజేసిన అనంతరం దర్యాప్తు చేపట్టనుంది.

అంతకుముందు ఈ నెల11న కస్టడీలో చిత్రహింసల కేసును విచారించేందుకు తాజా సిట్‌తో కూడిన ఐదుగురు మహిళలతో సహా ఏడుగురు ఐపీఎస్ అధికారుల జాబితాను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా, సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ హైకోర్టు అక్టోబర్ 8 నాటి ఉత్తర్వుపై స్టే విధించింది. మహిళ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. కాగా, ఆర్జీకర్ హత్య ఘటనకు వ్యతిరేకంగా నిరసనలో పాల్గొన్న రెబెక్కా ఖాతూన్ మొల్లా, రామ దాస్ అనే ఇద్దరు మహిళలను సెప్టెంబర్ 7 న అరెస్టు చేశారు. మరుసటి రోజు డైమండ్ హార్బర్ కోర్టు నుంచి జ్యుడీషియల్ కస్టడీ పొందాలని ఆదేశించే వరకు వారు పోలీసుల కస్టడీలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఓ మహిళను చిత్ర హింసలకు గురి చేశారని ఆరోపణలున్నాయి.

Advertisement

Next Story

Most Viewed