పెరుగుతున్న 'టర్కీ టీత్స్' ట్రెండ్.. హెచ్చరిస్తున్న వైద్యులు!

by Nagaya |
పెరుగుతున్న టర్కీ టీత్స్ ట్రెండ్.. హెచ్చరిస్తున్న వైద్యులు!
X

దిశ, ఫీచర్స్ : హాలీవుడ్ సెలబ్రిటీలు కేటీ ప్రైస్, కెర్రీ కటోనా, జాక్ ఫించమ్‌ సహా పలువురు ప్రముఖులు, ఇన్‌ఫ్లుయెన్సర్స్ సైతం 'టర్కీ టీత్స్' పెట్టుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో ఇదొక 'కాస్మెటిక్ డెంటల్' ట్రెండ్‌లా మారగా, దంతాలను అందంగా మార్చుకునేందుకు అనేకమంది విదేశాలకు వెళ్తున్నారు. ఇక ఆయా పోస్టులను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేయడంతో ఇది మరింత వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో 'టర్కీ టీత్స్' వల్ల కలిగే ప్రమాదాల గురించి దంతవైద్యులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.

'టర్కీ టీత్స్' వల్ల పెరుగుతున్న 'డెంటల్ టూరిజం'పై బ్రిటిష్ డెంటల్ అసోసియేషన్(BDA) 1,000 మంది దంతవైద్యులను సర్వే చేసింది. వీరిలో 95 శాతం మంది దంత చికిత్స కోసం విదేశాలకు వెళ్లిన రోగులను పరీక్షించినట్లు నివేదించగా.. 86 శాతం మంది కాంప్లికేటెడ్ కేసులకు చికిత్స చేసినట్లు చెప్పారు. అయితే 'టర్కీ టూత్స్' పెట్టుకున్న చాలా మందిలో దంతక్షయం/పుచ్చిపోవడం, అధిక నొప్పి సహా ఇతరత్రా సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ ట్రెండ్‌ను ఫాలో కావద్దని సూచిస్తున్న UK డెంటిస్ట్స్.. సంబంధిత ప్రమాదాల గురించి, తద్వారా దంతాలకు కలిగే నష్టం గురించి హెచ్చరిస్తున్నారు.

ఆకర్షిస్తున్న తక్కువ ధరలు :

ఈ 'టర్కీ టీత్స్' తెల్లగా, చతురస్రాకారంలో, ఆకర్షణీయంగా ఉంటాయి. ముఖ్యంగా మిలీనియల్స్, సోషల్ మీడియా వినియోగదారులు వీటిని పొందేందుకు ఆసక్తిగా ఉన్నారు. పైగా టర్కీలో ఈ దంతాల చికిత్సకు తక్కువ ధరలు ఉండటంతో చాలామంది అటువైపు మొగ్గు చూపుతున్నారు. అంతేకాదు దంతాలను అమర్చుకోవాలనుకున్న వ్యక్తులు వాటి ఆకారం, నాణ్యత, షేడ్స్ వంటి ఆప్షన్స్ కూడా ఎంచుకునే అవకాశముంది. అయితే ఈ చికిత్స కోసం కనీసం రూ. 48 వేలు(£500) ఖర్చవుతుందని మూడింట రెండొంతుల దంతవైద్యులు చెప్తున్నారు. మరికొందరు రూ. 95వేలకు(£1,000) పైగా ఖర్చవుతుందని, ఐదుగురు వైద్యుల్లో ఒకరు రూ. 4,79,882(£5,000) మించి ఖర్చవుతుందని చెప్పారు.

ఉత్పన్నమయ్యే సమస్యలు :

* నెర్వ్ డ్యామేజ్/కణజాలం దెబ్బతినడం

* తీవ్రమైన నొప్పి

* వాపు

* నమలడంలో ఇబ్బంది

* నిర్దిష్ట ప్రాంతంలో చికాకు, వాపు

జాగ్రత్తలు :

* 'కాస్మెటిక్ డెంటల్ సర్జరీ'కి ముందు డెంటల్స్ చెకప్, వాటిని శుభ్రపరచడం కోసం తరచుగా అపాయింట్‌మెంట్లు తీసుకోవాలి.

* కాస్మెటిక్ ఓరల్ సర్జరీకి ముందు ధూమపానం మానుకోవాలి, అయితే శాశ్వతంగా మానేయడం ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు.

* చక్కెర, యాసిడ్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని పరిమితం చేయాలి. ఎందుకంటే ఈ పదార్థాలు దంతాల ఎనామిల్ క్షీణించేలా చేస్తాయి. ఈ ఆమ్లాల వల్ల కావిటీస్ ఏర్పడతాయి. టీ, కాఫీ, సిట్రస్ ఫ్రూట్స్ కూడా టీత్ ఎనామిల్‌ను నాశనం చేస్తాయి.

Advertisement

Next Story