విధ్వంసక, వినాశకర వెపన్ 'వైట్ ఫాస్పరస్ బాంబ్'!

by Javid Pasha |
విధ్వంసక, వినాశకర వెపన్ వైట్ ఫాస్పరస్ బాంబ్!
X

దిశ, ఫీచర్స్ : ఉక్రెయిన్‌, తూర్పు లుహాన్స్‌క్ ప్రాంతంలోని పోపస్నా గ్రామంపై రష్యా ఫాస్పరస్ బాంబులతో దాడి చేసినట్లు ఉక్రెయిన్ మానవ హక్కుల అంబుడ్స్‌వుమన్ ఆరోపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా దీనిపై రష్యా ఇంకా స్పందించలేదు. అయితే రోమ్ కన్వెన్షన్ ప్రకారం ఫాస్పరస్ బాంబును వినియోగించడం యుద్ధ నేరమే కాక చట్టవిరుద్ధం కూడా. 800 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ స్థాయిలో వెలిగించిన ఫాస్పరస్ జ్వాలలు వందల చదరపు కిలోమీటర్ల మేర వ్యాపిస్తాయని, అటువంటి సాధనాల ఉపయోగం ప్రాణాంతక గాయాలకు లేదా మరణానికి దారి తీస్తుందని అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీ పేర్కొంది. ఈ బాంబు నేపథ్యం గురించిన వివరాలు..


'వైట్ ఫాస్పరస్' అంటే ఏమిటి?

వైట్ ఫాస్పరస్(తెల్ల భాస్వరం) ఆక్సిజన్‌తో చర్యనొందినపుడు అగ్గి రాజుకుని దుర్వాసనతో కూడిన దట్టమైన తెల్లటి పొగ ఉత్పత్తవుతుంది. ఈ పొగ ఇన్‌ఫ్రారెడ్ విజన్‌తో పాటు వెపన్-ట్రాకింగ్ సిస్టమ్స్‌ను అడ్డుకోగలదు. తద్వారా 'యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్' వంటి గైడెడ్ ఆయుధాల నుంచి మిలటరీ యూనిట్లను కాపాడుకోవచ్చు. అంతర్జాతీయ చట్టం ప్రకారం దీన్ని జనావాస ప్రాంతాలపై ప్రయోగించడం చట్టవిరుద్ధం. ఈ ఆయుధాన్ని ప్రయోగించినప్పుడు వెలువడే విషపూరిత పొగను పీల్చిన వ్యక్తులు చనిపోయే ప్రమాదముంది. అంతేకాదు సంబంధిత శకలాలు మానవ శరీరంలోకి లోతుగా చొచ్చుకుపోతాయి. వాటి కణాలు కాలిపోయే వరకు లేదా ఆక్సిజన్ శాతం తగ్గేంతవరకు మండుతూనే ఉంటాయి. అందుకే ఈ వైట్ ఫాస్పరస్‌ను యునైటెడ్ నేషన్స్ నిషేధించాయి.


చరిత్ర/అంతర్జాతీయ ఒడంబడిక

చరిత్ర ప్రకారం ఐరిష్ జాతీయవాద ఆర్సోనిస్టులు 19వ శతాబ్దంలో మొదటిసారి ఈ తెల్ల భాస్వరాన్ని ఉపయోగించారు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లోనూ దీన్ని విస్తృతంగా ఉపయోగించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 1920 ఇరాకీ తిరుగుబాటు సమయంలో దీన్ని మోర్టార్లు, షెల్స్, రాకెట్స్, గ్రెనేడ్లలో ఉపయోగించారు. ఇక కెమికల్ వెపన్స్ కన్వెన్షన్(CWC) అనేది రసాయన ఆయుధాల వినియోగాన్ని నిషేధించే ఒక బహుళజాతి సమావేశం. నిర్ణీత కాల వ్యవధిలో వాటిని పారవేయడాన్ని ఈ ఒడంబడిక తప్పనిసరి చేస్తుంది. దీని ప్రకారం రసాయన ఆయుధాల అభివృద్ధి, తయారీ, కొనుగోలు, నిల్వల నిలుపుదల నిషేధించబడ్డాయి.

Advertisement

Next Story

Most Viewed