అక్క‌డ గెడ్డం, టోపీ ఉండ‌కూడ‌దంట‌! ఎందుకంట..?!

by Sumithra |
అక్క‌డ గెడ్డం, టోపీ ఉండ‌కూడ‌దంట‌! ఎందుకంట..?!
X

దిశ‌, వెబ్‌సైట్ః రామ‌రాజ్యానికి ప్ర‌త్యక్ష‌ ఉదాహ‌ర‌ణ ఇలాగే ఉంటుందేమో అనేట‌ట్లు క‌ర్నాట‌క‌లో కొన్ని మ‌త సంఘాలు వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. పురాణాల రామ‌రాజ్యంలో స‌మ‌న్యాయ‌ముంద‌ని చెబుతూనే క్షేత్ర‌స్థాయిలో మాత్రం ప‌తాక స్థాయి వివ‌క్ష‌కు తెగ‌బ‌డుతున్నారు. బిజెపి పాలిత క‌ర్నాట‌క‌లో మొద‌ట హిజాబ్‌తో మొద‌లైన వివాదం, హిందూ దేవాల‌యాల ద‌గ్గ‌ర ముస్లిం దుకాణాలు ఉండ‌కూడ‌ద‌ని, ఆ త‌ర్వాత హ‌లాల్ మాంసం నిషేధం, మ‌సీదుల్లో లౌడ్ స్పీక‌ర్ల నిషేధం.. దాటి, తాజాగా, హిందూ దేవాల‌యాల ద‌గ్గ‌ర వ్యాపారం చేసుకునే ముస్లింల‌కు టోపీలు, గెడ్డం ఉంటే హిందూ భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ‌తింటున్నాయ‌నే ప‌రిస్థితికి చేరుకుంది.

పొట్ట‌కూటి కోసం పళ్ల‌మ్ముకునే పేద‌ ముస్లింల తోపుడుబ‌ళ్ల‌ను ధార్వాడ్ జిల్లాలో హిందూత్వ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఇది జ‌రిగిన కొన్ని గంట‌ల‌ తర్వాత ఆ హింస‌ను స‌మ‌ర్థిస్తూ కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ కొన్ని వ్యాఖ్య‌లు చేశాడు. హుబ్లీ-ధార్వాడ పశ్చిమ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ మాట్లాడుతూ, హిందూ దేవాల‌యాల ద‌గ్గ‌ర ముస్లిం ఆహార్యాన్ని చూస్తే హిందువులు ఎలా భావిస్తార‌ని అన్నారు. త‌ల‌పై టోపి, మీసం గీసుకొని, గ‌డ్డం పెంచుకుంటే హిందూ భ‌క్తులు ఫీల‌వుతారంట‌! అందుకే, ముస్లింల పుచ్చకాయల‌ బండ్లను ధ్వంసం చేయ‌డం స‌రైన‌దే అన్న‌ట్లు మాట్లాడాడు.

కాగా, ముస్లిం వ్యాపారులపై శనివారం దాడి చేసిన‌ ఎనిమిది మంది నిందితుల్లో నలుగుర్ని పోలీసులు అరెస్టు చేశారు. తీవ్ర‌స్థాయికి చేరుకున్న మతపరమైన వివ‌క్ష ప‌ట్ల క‌ర్నాట‌క ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ, ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని హింసకు పాల్పడితే సహించబోమని అన్నారు. "ఇలాంటి ప‌రిస్థితుల ప‌ట్ల‌ మనం మాట్లాడకూడదు, మన పని మాట్లాడాలి. ఏ పరిస్థితిలో, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ చర్య అవసరం, దానిని మేము తీసుకుంటున్నాము" అని బొమ్మై మ‌ర్మ‌గ‌ర్భంగా మ‌న‌సులో ఉన్న‌ది క‌క్కారు. ఇంత‌కీ, ఈ 'భిన్న‌త్వంలో ఏక‌త్వం ఇంకెన్ని 'అగ్నిప‌రీక్ష‌లు' ఎదుర్కోవాలో ఏమో' అంటూ స‌మాన‌త్వ కార్య‌క‌ర్త‌లు లా పుస్త‌కాలు వెతుక్కుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed