ఆ వెంచర్‌లో ప్లాట్లు కొంటే అంతే సంగతులు..

by Manoj |
ఆ వెంచర్‌లో ప్లాట్లు కొంటే అంతే సంగతులు..
X

దిశ, అశ్వాపురం : మండల పరిధి మొండికుంట గ్రామ పంచాయతీలోని భీముడిగుడం కొత్తూరు బస్ షెల్టర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఓ వెంచర్ అక్రమంగా అనుమతులు పొందినట్లు సమాచారం. వెంచర్ ఏర్పాటు కోసం అధికారులకు ఆమ్యామ్యాలు సమర్పించి అనుమతులు పొందినట్లు ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇండ్ల స్థలాల కోసం వెంచర్ ఏర్పాటు చేసే ముందు ఆ స్థలంలో బడి, గుడి, ఆటస్థలం, పార్క్, కమ్యూనిటీ హాల్ వంటి వాటికి స్థలాలను కేటాయించాలనే నిబంధనలున్నాయి. కేటాయించిన స్థలం కూడా ఆమోదయోగ్యంగా ఉండాలి.

కానీ ఇక్కడ కేటాయించిన స్థలం నిబంధనలకు విరుద్ధంగా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ వెంచర్లో మొత్తానికి కలిపి వాస్తు దోషం ఉన్న స్థలాన్ని త్రిభుజాకారంలో కట్ చేసి గుడి, బడి, ఆటస్థలం, పార్క్ అంటూ బోర్డులు పెట్టారు. కానీ లోపల వాటికి స్థలాలు కేటాయించినట్టు కనబడడంలేదని తెలిసింది. ఇవి లేకుండానే అనుమతులు తీసుకుని వెంచర్ నిర్వాహకులు ప్లాట్లను రూ.లక్షల్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని విమర్శలు సైతం లేకపోలేదు. ఈ అనుమతులపై ఉన్నతాధికారులు సమీక్ష జరపాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు. ఈ ప్లాట్ల విషయంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తే.. లక్షలాది రూపాయలు వెచ్చించి ప్లాట్లు కొనుక్కున్న వారు అసౌకర్యాలకు గురికాక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఉన్నతాధికారులు ఏం చేస్తారో వేచి చూడాలి.




Advertisement

Next Story

Most Viewed