Kishan Reddy: డైనింగ్ టేబుల్ మీద తెలంగాణ ప్రజల జీవితాలు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

by Vinod kumar |   ( Updated:2022-04-15 10:57:53.0  )
Kishan Reddy: డైనింగ్ టేబుల్ మీద తెలంగాణ ప్రజల జీవితాలు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజల బతుకులను డైనింగ్ టేబుల్ వద్ద రాస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా రెండో రోజు సంజయ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తదితరులతో కలిసి మంత్రి పాల్గొన్నారు. అనంతరం అలంపూర్ సమీపంలో ఉన్న లింగనవాయి గ్రామంలో ప్రజలనుద్దేశించి మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్, పామ్ హౌస్ దాటి సచివాలయానికి వచ్చిన దాఖలాలు లేవు, పలు సమస్యలతో వచ్చే ప్రజలు, వీర సంఘాల నాయకులనే కాదు, ఎమ్మెల్యేలను కూడా కలవడు. కేవలం సీఎం కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో ప్రగతి భవన్ డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని ఈ రాష్ట్ర ప్రజల బతుకుల రాతలు రాస్తున్నారని మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.


తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1400 మంది పేదలు ఆత్మహత్యలు చేసుకుంటే.. మరెంతో మంది పోరాటాలు చేసి, జైలు పాలై తెలంగాణను సాధించుకుంటే ఈ నయా నిజాం కేసీఆర్ అధికారాన్ని చెలాయిస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని ఆరోపించారు. 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నానని సీఎం కేసీఆర్ చెబుతున్నాడు. మరి ఇళ్లకు చార్జీలను పెంచి వసూలు చేస్తున్నాడు అన్న విషయం ప్రజలు గుర్తించాలన్నారు. పేద ప్రజలకు మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భవ పథకాన్ని అమలు చేస్తే ప్రధానమంత్రికి ఎక్కడ పేరు వస్తుందోనన్న భయంతో ఆ పథకం అమలు చేయకుండా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు.


గతంలో ఎంతో మంది నియంతలా వ్యవహరించారు. ఇక ప్రజలు చూస్తూ కూర్చోవడానికి సిద్ధంగా లేరని మంత్రి చెప్పారు. ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో తిరిగి మోడీ అధికారంలోకి రావడం.. రాష్ట్రంలో కేసీఆర్ పాలన అంతం కావడం ఖాయమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బండి సంజయ్ ఆధ్వర్యంలో సాగుతున్న ప్రజా సంక్షేమ యాత్రను జయప్రదం చేసి అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు అని మంత్రి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed