జీతం లేని సేవలు.. ప్రశ్నిస్తే ఉద్యోగం ఊస్ట్

by Nagaya |
జీతం లేని సేవలు.. ప్రశ్నిస్తే ఉద్యోగం ఊస్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో ఆసుపత్రుల్లో పనిచేసే కార్మికులకు సకాలంలో జీతాలు అందడం లేదు. దీంతో శానిటేషన్​, పేషెంట్​కేర్​, సెక్యురిటీ సిబ్బంది అవస్థలు పడుతున్నారు. రెండు నెలలుగా వేతనాలు కోసం వేల మంది వేచిచూస్తున్నారు. ప్రతీ సారి ఇదే లొల్లి నడుస్తుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా రెండు ,మూడు నెలలకోసారి జీతాలు ఇవ్వడం వలన కుటుంబ పోషణ బారంగా ఉన్నదంటున్నారు. వేతనాల విషయంలో ప్రశ్నిస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని కాంట్రాక్ట్​ సంస్థ సూపర్​ వైజర్లు బెదిరిస్తున్నట్లు కార్మికులు ఆరోపిస్తున్నారు. తమకు ఇచ్చేదే తక్కువని, అదీ సమయానికి ఇవ్వకపోతే ఎలా? అని ఏజీల్​కాంట్రాక్ట్​కింద పనిచేస్తున్న కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్​, పేట్ల బురుజు, మెటర్నిటీ సుల్తాన్​బజార్ ఆసుపత్రులన్నింటిలోనూ ఇదే పరిస్థితి ఉన్నది. మంత్రి హరీష్​రావు ప్రత్యేక చొరవ తీసుకొని తమకు న్యాయం చేయాలని సదరు కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

విచిత్రంగా నిరసనలు...

ఆసుపత్రుల్లో పనిచేసే కార్మికులకు సకాలంలో జీతాలు ఇవ్వకపోవడంతో విచిత్రంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వార్డులు, ఆసుపత్రి ప్రాంగణాల్లో చెత్త, చెదారాన్ని తొలగించడం లేదు. కేవలం మెయిన్​ బ్లాక్​లు, ఆఫీసర్లు ఉన్న ప్రదేశాలను మాత్రమే క్లీన్​ చేస్తూ మిగిలినవి వదిలేస్తున్నారు. సూపర్​ వైజర్లు అడిగినా, జీతాలు ఇవ్వనిది తామేందుకు పూర్తి స్థాయిలో పనిచేస్తామని కార్మికులు తేల్చి చెబుతున్నారు. దీంతో ఆసుపత్రులన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఇదంతా ఉన్నతాధికారులకు తెలిసినా స్పందన కరవైంది. డీఎంఈ రమేష్​రెడ్డికి కూడా ఏజీల్​ కార్మికుల వేతనాల చిక్కులపై స్పష్టంగా అవగాహన ఉన్నది. టీచింగ్ ఆసుపత్రులకు బాస్​గా ఉన్న ఆయన కూడా ఈ సమస్యపై మౌనంగా ఉండటం గమనార్హం.

అంతా పేదలే...

సెక్యూరిటీ, పేషెంట్​ కేర్​, శానిటేషన్​ వ్యవస్థలో పనిచేసే వారంతా పేదలే. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితుల్లో ఉంటారు. జిల్లాల్లో ఎవుసం, కూలీ దొరకనోళ్లంతా పట్నం వచ్చి ఈ సెక్టార్​లలో పనిచేస్తుంటారు. పక్క రాష్ట్రాల నుంచి కూడా మరి కొందరు ఏజీల్​ గ్రూప్​ కాంట్రాక్ట్​ లో కార్మికులుగా పనిచేస్తున్నారు. ఇలాంటి వారి జీతాలు సమయానికి ఇవ్వకపోవడంపై ప్రభుత్వ తప్పిదంగానే గుర్తించాలని ప్రతిపక్ష పార్టీలు నొక్కి చెబుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed