- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జోక్ ముసుగులో చిన్నచూపు.. మహిళలపై పెరుగుతోన్న సెక్సిస్ట్ వ్యాఖ్యలు
దిశ, ఫీచర్స్: 'అబార్షన్ చట్టాలపై ఆంక్షలు విధింపు' ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిజానికి 'అబార్షన్' మహిళ తన సొంత దేహంపై తాను మాత్రమే తీసుకోవలసిన ఎంపిక. అయితే అబార్షన్ గురించి హాస్యాస్పదంగా మాట్లాడటంతో పాటు 'నా శరీరం నా ఎంపిక'ను ఓ పంచ్‌లైన్‌గా వాడుకునేందుకు కమెడియన్స్‌కు కూడా ఎక్కువ సమయం పట్టలేదు. ఇదిలా ఉంటే.. ఈ విషయంపై స్టాండప్ కమెడియన్ సమయ్ రైనా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో దుమారం రేపింది. నెటిజన్లు అతడి వ్యాఖ్యలను 'అసహ్యకరమైనవి, స్త్రీద్వేషపూరితమైనవి'గా వర్ణించారు. దీంతో ఇది ఓ జోక్ మాత్రమేనని రైనా సమాధానమిచ్చాడు. కానీ హాస్యం పేరుతో మహిళా సమస్యలను చిన్నచూపు చూడాల్సిన అవసరం లేదనే వాదన తెరపైకి వచ్చింది. అవును.. మహిళల కట్టుబొట్టు, శరీరాకృతి, చివరకు ఇంట్లో చేసే పనులపైనా నిత్యం వందలాది జోక్స్, సెటైర్స్ సోషల్ మీడియాను ముంచెత్తుతుంటాయి. వాట్సాప్, ఫేస్‌బుక్ గ్రూపుల్లో, ఇన్‌స్టా పేజీల్లో షేర్ అవుతుంటాయి. మరి వాటి సంగతేంటి? వాటిపై మాట్లాడే గొంతు ఏది?
సోకాల్డ్ మేధావులు, విద్యావంతులు, ప్రొఫెషనల్స్, ఎక్స్‌పర్ట్స్, సెలబ్రిటీలు.. ఇలా ఎంతోమంది ఉపయోగించే సోషల్ మీడియా సైట్లలో పేలే జోక్స్‌లో అచ్చంగా 'ఆమె' ఉంటుంది. పత్రికలు, టీవీల్లోనూ భార్యాబాధితులుగా పేర్కొంటూ బోలెడన్ని జోక్స్ వస్తుంటాయి. వాటిపై ఏ ఒక్క గొంతు మాట్లాడకపోగా.. ఆయా సందేశాలకు రకరకాల ఎమోటికాన్స్ జతచేస్తూ పరో పదిమందికి ఫార్వార్డ్ చేస్తుంటారు. నిజానికి అందులో కామెడీ కంటెంట్ కన్నా మహిళలను డౌన్‌గ్రేడ్ చేసే అంశాలే ఎక్కువ. మహిళలకు ఇవన్నీ అభ్యంతరకరంగా ఉన్నా.. సదరు మెసేజ్‌లను జోక్స్‌గానే చూడాలంటూ 'రైనా' మాదిరే మనమూ హితబోధ చేస్తాం. అంతేకాదు ఈ బిజీ లైఫ్‌లో ఆ మెసేజ్ ఓ స్మాల్ రిఫ్రెష్‌మెంట్ అని గొప్ప వేధాంతిలా ఉచిత సలహా పారేస్తాం. వాస్తవానికి కొన్ని 'జోక్స్' చూస్తే.. ఈ పురుషులు ఏ శతాబ్దంలో నివసిస్తున్నారు? ఎలాంటి విలువలతో పెరిగారనే ఆశ్చర్యం కలగకమానదు.
సెక్సిస్ట్ క్రాకర్స్ :
పురుషాధిపత్య ప్రపంచంలో మహిళా విజయాలను బహిరంగంగా స్వాగతించలేమనే విషయం నిర్వివాదాంశం. అందువల్లే భర్త సంపాదిస్తే భార్య ఖర్చుపెట్టే రోజులు పోయాయన్న విషయాన్ని ఇంకా చాలామంది గుర్తించలేకపోతున్నారు. ఇంటి నాలుగు గోడల మధ్యే ఆమె బందీ అయినట్లు వ్యవహరిస్తున్నారు. వారికి కూడా సొంత కలలు, ఆకాంక్షలు ఉన్నాయని, మరీ ముఖ్యంగా అన్ని అంశాల్లో ఆమె తమకు సమానమని వారు గుర్తించడం లేదు. ఈ క్రమంలోనే ఇల్లంటే జైలుగా, భార్యను జైలర్, హిట్లర్, డెవిల్ అనే పదాలతో సంభోదిస్తూ జోక్స్ వేస్తుంటారు. అంతేకాదు ఆమె ఇంట్లో చేస్తున్న పనికి ఏమాత్రం గుర్తింపునివ్వకుండా, ఆమె గురించి ప్రస్తావించే సమయంలో 'తినడం, పడుకోవడం, సీరియల్స్ చూడటం ఇదే పని' అనే వ్యాఖ్యలు కూడా ఓ రకమైన హేళనే. కానీ మన సమాజం ఇలాగే పని చేస్తుంది. పురుషులు స్వేచ్ఛగా సెక్సిస్ట్ వ్యాఖ్యలతో స్త్రీలను కించపరచడం సర్వసాధారణమైపోయింది. ఇలాంటి సెక్సిస్ట్ జోక్స్‌ను నిరంతరం నిస్సందేహంగా వినడం ద్వారా వాటిని రోజువారీ జీవితంలో సాధారణీకరిస్తున్నాం. దీంతో అవి సమాజంలోనూ చెలామణి అయిపోతుంటాయి.
ఆఫీసుల్లోనూ :
కార్యాలయాల్లో కామెడీగా కనిపించే కొన్ని నిర్దిష్ట వ్యాఖ్యలు, చర్యలు ఎంత లోతుగా ఉంటాయో చాలామంది గమనించరు. రెగ్యులర్‌గా వింటుంన్నందున వర్క్ ప్లేస్‌లో అవి కామన్ వర్డ్స్‌గా మారిపోయాయి. పనిలోఉన్న 'పీర్, పవర్ ప్రెజర్' మధ్య మహిళలు తమ అసమ్మతిని నేరుగా వ్యక్తం చేయడం కష్టం. కానీ కొన్ని అధ్యయనాల సందర్భంగా మహిళలు తాము ఎదుర్కొన్న అనుభవాల గురించి వ్యక్తపరిచారు. కంపెనీలో కొత్తవారికి వారి శారీరక లక్షణాల ఆధారంగా 'రేటింగ్' ఇవ్వడం, కొందరు సీనియర్స్ తమ 'గర్ల్‌ఫ్రెండ్స్'గా పేర్కొనడం, కొత్తగా ఉద్యోగంలో చేరినవారిని 'ఐటెమ్స్'గా సంబోధించడం వంటి సమస్యాత్మక ప్రవర్తనల గురించి పలువురు పేర్కొన్నారు. అంతేకాదు మరికొందరు 'యే వాలీ మేరీ హై' లేదా 'భాయ్.. ఆయా మేరీ భాబీ' అనే పదాలను ప్రతీ ఆఫీసులో ఉపయోగిస్తుంటాం. హాస్యం ముసుగులో స్త్రీద్వేషం ఎంత లోతుగా ఉంటుందో అర్థం చేసుకోలేకపోతాం.