పాలేరులో తుమ్మల అభిమానుల రహస్య సమావేశం.. ఈ భేటీ తర్వాత ఏం జరుగునుందో..?

by S Gopi |   ( Updated:2022-03-11 11:43:32.0  )
పాలేరులో తుమ్మల అభిమానుల రహస్య సమావేశం.. ఈ భేటీ తర్వాత ఏం జరుగునుందో..?
X

దిశ, పాలేరు: నియోజకవర్గ పరిధిలోని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు శుక్రవారం ఖమ్మంలోని ఓ క్లబ్ లో రహస్యంగా భేటి అయ్యారు. టీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలతోపాటు ఇటీవల మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని, మాజీ ఎంపీ పొంగులేటిని జూపల్లి కలిసిన రెండు రోజులు తర్వాత ఈ సమావేశం జరగడంతో జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నిజమైన టీఆర్ఎస్ కార్యకర్తలకు నియోజకవర్గంలో అన్యాయం జరుగుతున్న నేపథ్యంలో తాము ఇలా భేటీ అయ్యామని తుమ్మల వర్గీయులు చెబుతున్నారు. వేరే పార్టీల నుంచి కొంతమంది టీఆర్ఎస్ లోకి వచ్చినవారు ఇప్పుడు 2018 ఎన్నికల్లో నిజమైన టీఆర్ఎస్ గెలుపునకు కృషి చేసిన నాయకులను టార్గెట్ చేస్తున్నారని.. వాటిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పార్టీకి నష్టం లేకుండా చేయడం కోసమే భేటి అయ్యారని చెబుతున్నారు. పాలేరు నియోజకవర్గం నుంచి తుమ్మలకు మద్దతు తెలిపి ముందుకు సాగనున్నట్లు తెలుస్తోంది. తుమ్మల వర్గీయులు రహస్య భేటీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నాయకుల కార్యాచరణ రూపొందించేందుకు నాలుగు మండలాల నాయకులు సమావేశం అయినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు మరో వారంలో మరి కొంతమందితో, కలసివచ్చే నాయకులతోనూ చెర్వుమాధారం గ్రామంలో విస్తృత సమావేశం నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నట్లు తుమ్మల వర్గీయులు తెలిపారు. రేపోమాపో నియోజకవర్గంలోని తాజా, మాజీ ప్రజాప్రతినిధులు కొంతమంది, పలు పార్టీల నాయకులు, అసమ్మతి వర్గాన్ని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసేందుకు సిద్ధంగా ఉన్నారని విశ్వసనీయ సమాచారం. ఈ రహస్య భేటీలో నాలుగు మండలాల నుంచి 84 మంది ముఖ్య నాయకులు, జిల్లా నాయకులు రామసహయం నరేష్ రెడ్డి, వెంకట రెడ్డి, రామా శ్రీను, బండి జగదీష్, తమ్మినేని కృష్ణయ్య, జొన్నలుగడ్డ రవి, మాదాసు ఉపేందర్, బారి వీరభద్రం, వెన్నపూసల సీతారాములు, రమేశ్, జానకి రామయ్యా, భద్రయ్య, శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story