KTR ఇలాకాలో సంచలనంగా TRS మహిళా నేత లేఖ

by Satheesh |
KTR ఇలాకాలో సంచలనంగా TRS మహిళా నేత లేఖ
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: మంత్రి కేటీఆర్ ఇలాఖాలో అధికార పార్టీకి చెందిన మహిళా ప్రజా ప్రతినిధి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విలీన గ్రామాలను చిన్నచూపు చూస్తున్నారంటూ మున్సిపల్ కమిషనర్‌కు రాసిన లేఖ నెట్టింట వైరల్‌గా మారడం కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో నెంబర్ 2గా ఉన్న కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల మున్సిపాలిటీలోని విలీన గ్రామాలకు నిధులు కేటాయించడం లేదంటూ 11వ వార్డు కౌన్సిలర్ ఒగ్గు ఉమా రాజేశం రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. పట్టణంలోని రాజీవ్ నగర్‌ను 11వ వార్డుగా గుర్తించినప్పటికీ.. ఇప్పటి వరకూ ఎలాంటి అభివృద్ది జరగలేదని, ఇళ్ల మీదుగా వెలుతున్న విద్యుత్ వైర్లు అలాగే ఉన్నాయని, లూజ్ కనెక్షన్లు చాలా ఉన్నాయని, నీటి సమస్య కూడా ఇబ్బందికరంగా ఉందని చెప్పినట్టు కౌన్సిలర్ ఆ లేఖలో వివరించారు.

విలీన గ్రామాలకు మొదటి స్థానం కల్పిస్తామని చెప్పినప్పటికీ, రెండేళ్లు గడిచినా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఉమ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి దృష్టికి తీసుకెళ్లానని, ఓఎస్డీ చెప్పినా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, ప్రతి సమస్యను దాటవేస్తూ నిర్లక్ష్యం వహిస్తే కొన్ని సమస్యలకు సమాధానం కమిషనర్‌పై ఉంటుందని, ప్రతి దానికి మున్సిపల్‌లో బడ్జెట్ లేదని చెప్తున్నారన్నారు. మంత్రి ఇలాఖాలో మేం ప్రజల ముందు తలదించుకునే పరిస్థితి తెస్తున్నారని, ఇప్పటికైనా రాజీవ్ నగర్‌లో మౌళిక వసతులు కల్పించాలని కోరుతూ కౌన్సిలర్ ఉమ లేఖ రాశారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ లేఖతో అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల్లోనూ ఎంతటి నైరాశ్యం నెలకొని ఉందో స్పష్టం అవుతోంది. ఏది ఏమైనా అధికార పార్టీ కౌన్సిలర్ కమిషనర్‌కు లేఖ రాయడం మాత్రం సంచలనం కల్గించిందని చెప్పవచ్చు.




Advertisement

Next Story