తాగునీటి కోసం గిరిజనుల ఇక్కట్లు.. నెల రోజులుగా నీళ్లు బంద్

by Mahesh |
తాగునీటి కోసం గిరిజనుల ఇక్కట్లు.. నెల రోజులుగా నీళ్లు బంద్
X

దశ, ములకలపల్లి: అసలే వేసవి కాలం .. ఎండల తీవ్రత కూడా పెరుగుతుంది.. పెరుగుతున్న ఎండలతో నీటి అవసరాలు కూడా పెరిగాయి. ఒక పక్క తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ క్రింద కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇంటింటికీ నల్లా ద్వారా నీరు అందిస్తుంటే, దాని అమలు మాత్రం క్రింది స్థాయిలో అబాసుపాలు అవుతుంది. నెల రోజులుగా రేగులకుంట గ్రామానికి త్రాగు నీరు రాకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తమ ఇబ్బందులు గ్రామ పంచాయతీ అధికారులకు చెప్పినా ఎలాంటి పరిష్కారం చేయకపోవడం వల్ల ఆ గ్రామం తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటుంది.

చేతి పంపు దగ్గరే రోజంతా సరిపోతుంది

జగన్నాధపురం పంచాయతీలో భాగం అయిన రేగులకుంట గిరిజన గ్రామం మొత్తం 3 గుంపులుగా ఉంటుంది. ప్రస్తుతం రెండు గుంపులకు నెలరోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. రెండు గుంపులకు ఉన్న ఒకే ఒక్క చేతి పంపు ద్వారా 40 కుటుంబాలు నీటి కోసం పడిగాపులు పడాల్సి వస్తుంది. ఉదయం నుంచి చేతి పంపు దగ్గర లైన్లు కట్టి తమ వంతు వచ్చేవరకు వేచిచూడాల్సి వస్తుందని గ్రామస్తులు వాపోతున్నారు. ఇక్కడ నివసించే గిరిజనులు పూర్తిగా కూలి పై ఆధారపడిన కుటుంబాలు. వంట చేసుకునేందుకు కేవలం రెండు బిందెలు మాత్రమే సేకరించాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కూలి పనులు చేసుకుని ఇంటికి వచ్చాక సాయంత్రం నుంచి మళ్ళీ నీటి కోసం లైన్ లో ఉండాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు.

శాశ్వత పరిష్కారం మేలు

గడిచిన నెల నుంచి నీటి కోసం ఇబ్బందులు పడుతున్న గిరిజనులు తమ ఇబ్బందులను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకు వెళ్తే ఎలాంటి పరిష్కారం లభించ లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెండు గుంపులకు నీటి అవసరాలు తీర్చేందుకు నిధులు లేవని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న దగ్గర నుంచి ఈ రెండు గుంపులు కొంచెం ఎత్తయిన ప్రదేశంలో ఉండటం తో ప్రతి ఏటా ఈ ప్రజలకు నీటి ఇబ్బందులు తప్పడంలేదు. మిషన్ భగీరథ నీటి పైప్ లైన్లు ఉన్నప్పటికీ ఇండ్లలోకి నీరు నిదానంగా వస్తున్నట్లు తెలుస్తుంది. ఈ గ్రామానికి పూర్తిస్థాయిలో నీరందించాలంటే బయట వారి గుంపులో నీటి ట్యాంక్ కానీ, మోటార్ కానీ ఉంటే తప్ప ఈ సమస్య పరస్కరం కాదన్నది వాస్తవం. ఈ దిశగా అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక మహిళలు కోరుతున్నారు.

Next Story

Most Viewed