'దొంగ దీక్ష చేసి రైతులను మోసం చేయద్దు'

by samatah |
దొంగ దీక్ష చేసి రైతులను మోసం చేయద్దు
X

దిశ, తెలంగాణ బ్యూరో: దొంగ దీక్షలు చేసి రైతులను మభ్య పెట్టి మోసం చేయడం అపెయ్యాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాలు అయిపోయాక నేడు కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేస్తున్నారని, ఈ ధర్నా రాష్ట్ర రైతులను మోసం చేయడం, మభ్యపెట్టడమేనని అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో స్పష్టమైన ప్రకటన చేయలేదన్నారు. కొనుగోలు కేంద్రాలు తెరవలేదని, ట్రాన్స్ పోర్ట్, గోనె సంచుల ఏర్పాట్లు చేయలేదన్నారు. ఇప్పటికే ఊర్లలో ధాన్యం కొనుగోలు ప్రారంభమయ్యాయని అన్నారు. ప్రభుత్వం కొనుగోలు ఆలస్యం చేస్తుండడంతో రైస్ మిల్లర్లకు, వ్యాపారస్తులకు రైతులు అమ్ముకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో 80 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వాంగా ఆలస్యం చేయడం వల్ల రైతులు క్వింటాల్‌కు 600 రూపాయలు నష్టపోతున్నారని, రాష్ట్రంలో 4800 కోట్ల రూపాయల కుంభకోణం ఇదని, రైస్ మిల్లర్లతో కేసీఆర్ కుటుంబం కుమ్మక్కు అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంకు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed