తెలంగాణలో పవర్ హాలిడే లేదు.. ప్రకటించిన కేటీఆర్​

by Nagaya |
తెలంగాణలో పవర్ హాలిడే లేదు.. ప్రకటించిన కేటీఆర్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో నెలకొల్పిన పరిశ్రమలకు ఎలాంటి సమస్యలు లేవు అని, పీఎం మోడీ సొంతరాష్ట్రం గుజరాత్‌లో పవర్ హాలిడేలు ఉన్నాయని, కానీ తెలంగాణలో మాత్రం పవర్ హాలిడే‌లు లేవని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఎఫ్ టీసీసీఐ ఆధ్వర్యంలో సోమవారం హెచ్ఐసీసీలో ఇండస్ట్రీ ప్రొడక్టివిటీ, ఆగ్రో‌బేస్డ్ ఇండస్ట్రీ, మార్కెటింగ్ ఇనిషియేటీవ్ తదితర రంగాలకు వివిధ కేటగిరీల్లో అవార్డులు అందజేత కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఎంఎస్ఎంఈలకు వారంలో మూడు, నాలుగు రోజులు పవర్ హాలిడే ఉండేదని,ఇందిరాపార్క్‌ వద్ద ధర్నాలు చేసేవారన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వం సరఫరా చేస్తున్న నిరంతర విద్యుత్ తో ఓవర్సీస్ ఇన్వెస్టర్లు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు.

టీఎస్‌ఐ పాస్ ద్వారా పరిశ్రమలకు 15 రోజుల్లో అనుమతులు ఇస్తున్నామన్నారు. దేశంలో ఇక్కడ ఇలాంటి పాలసీ లేదు. రాష్ట్రంలోని అనుకూలమైన వసతులతో ఇన్వెస్టర్లు రాష్ట్రానికి వస్తున్నారని అన్నారు. తెలంగాణలో టీ హాబ్ లార్జెస్ట్ ఇంక్యుబేటర్ అని స్పష్టం చేశారు. నల్గొండ,ఖమ్మం, నిజామాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్ నగర్‌ కూడా పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ఉందని, ఎన్నో కంపెనీలు పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయన్నారు. ఫిషరీస్‌లో తెలంగాణ దేశంలో నెంబర్ వన్ అయిందని , ఆయిల్ ఫామ్‌పై ఫోకస్ చేస్తున్నట్లు వెల్లడించారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ జోక్యం కానీ ఎలాంటి వేధింపులు కానీ లేవు అని స్పష్టం చేశారు. సమావేశంలో ఎఫ్ టీసీసీఐ సభ్యులు భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్, అనిల్ అగర్వాల్, జయదేవ్, వీణా, క్రాంతి, పారిశ్రామిక వేత్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story