బ్రేకింగ్: మందు బాబులకు అదిరిపోయే న్యూస్

by GSrikanth |   ( Updated:2022-04-04 12:19:19.0  )
బ్రేకింగ్: మందు బాబులకు అదిరిపోయే న్యూస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఓవైపు డ్రగ్స్​అంశం రాష్ట్రాన్ని కుదిపేస్తుండగా.. మద్యం అమ్మకాలపై ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే మద్యం అమ్మకాలు జోరు మీదున్నాయి. వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం మద్యం నుంచి వస్తున్నవే. నాలుగేండ్ల కిందట వరకు ప్రతిఏటా రూ.5 వేల కోట్లు కూడా సర్కారు రాని ఆదాయం.. 2020 నుంచి రెండింతలు అయింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది మరింత పెరిగింది. తాజాగా అమ్మకాల్లో సమయాన్ని పెంచుతూ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బార్ల తలుపులు బార్లా తెరిచింది. ముందుగా గ్రేటర్​హైదరాబాద్​పరిధిలోని బార్లన్నింటికీ అమ్మకాల సమయాన్ని గంట పెంచింది. వీకెంట్​స్పెషల్‌గా శని, ఆదివారాల్లో మరో గంట పెంచారు. ఇక స్టార్​హోటళ్లలో మద్యాన్ని నిరంతరంగా అమ్ముకునేందుకు అవకాశం ఇచ్చింది.

సమయం పెంపు ఇలా

మద్యం అమ్మకాలతో మరింత ఆదాయాన్ని రాబట్టుకునేందుకు ప్రభుత్వం పలు మార్పులు చేసింది. గ్రేటర్​హైదరాబాద్‌లో పరిధిలో అన్ని బార్లను అర్థరాత్రి 12 గంటల వరకు నిర్వహించుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా వీకెండ్ స్పెషల్‌గా శని, ఆదివారాల్లో మాత్రం రాత్రి ఒంటిగంట వరకూ బార్లను తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చింది. ఇక స్టార్ హోటల్స్, ఎయిర్‌పోర్ట్‌ హోటళ్లు లైసెన్స్ ఫీజుపై 25% అదనంగా చెల్లిస్తే 24 గంటలు మద్యం అమ్మకాలకు అనుమతించింది. దీంతో స్టార్​హోటళ్లలో మద్యం అమ్మకాలు నిరంతరం జరుపుకునేందుకు వెసులుబాటు కల్పించింది.

దండిగా ఆదాయం

ప్రభుత్వ ఖజానాకు మద్యానికి మించిన కిక్ మరొకటి లేకుండా పోయింది. రాష్ట్రంలో మద్యం కిక్‌తో ఖజానా గలగలమంటోంది. రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. ప్రస్తుతం 2,620 వైన్స్‌‌‌‌‌‌‌‌తో పాటు వెయ్యికి పైగా బార్లు, క్లబ్బులు, టూరిజం హోటళ్లున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో మద్యం డిపోల నుంచి అమ్మకాలు రూ.30,780 కోట్లు జరిగాయి. మార్చి నెలలో రూ.2, 810 కోట్లు జరిగాయని అధికారులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి అమ్మకాలు పెరిగాయి. 2020-21లో రూ. 27,289 కోట్లు అమ్మకాలు నమోదయ్యాయి. ప్రతి నెలా రూ.2500 కోట్ల నుంచి రూ.3 వేల కోట్ల వరకూ అమ్మకాలు సాగుతుండగా, రోజుకి సరాసరి రూ.100 కోట్ల వరకూ మద్యం తాగేస్తున్నారు. గత గురువారం ఒక్కరోజే రూ. 303 కోట్ల మద్యం అమ్ముడైంది. పండగలు, పబ్బాలు వచ్చాయంటే మద్యం తాగేవారి సంఖ్య పెరుగుతోంది. అందులోనూ సమ్మర్ ప్రారంభం కావడంతో బీర్ల అమ్మకాలు బాగా పెరిగాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.6,700 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.

మరో 4 వేల కోట్లకు ప్లాన్​

2022–23 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో.. సర్కారు కొత్త ప్లాన్​వేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.4 వేల కోట్లు అదనంగా రాబట్టేందుకు సర్కారు లక్ష్యం నిర్దేశించింది. దీనిలో భాగంగానే ముందుగా గ్రేటర్‌లో బార్లకు సమయాన్ని పెంచారు. త్వరలో రాష్ట్రమంతా బార్ల అమ్మకాలపై సమయం పెంచుతారని ఎక్సైజ్​అధికారులు చెప్పుతున్నారు. దీనిని బట్టి చూస్తే మందుబాబులే ప్రభుత్వాలకు మహారాజపోషకులు అవుతున్నారు.

Advertisement

Next Story