ఏపీ కొత్త జిల్లాలు పరిపాలన .. ముహూర్తం ఫిక్స్

by Manoj |
ఏపీ కొత్త జిల్లాలు పరిపాలన .. ముహూర్తం ఫిక్స్
X

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారు అయింది. ఏప్రిల్ 4న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ కొత్త జిల్లాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఉదయం 9.05 గంటల నుంచి 9.45 గంటల మధ్య కొత్త జిల్లాల అవతరణ కార్యక్రమం జరగనుంది. ఆ రోజు నుంచే కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభం కానుంది. ఇకపోతే తొలుత కొత్త జిల్లాల నుంచి ఉగాది రోజున పాలన ప్రారంభించాలని భావించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ కొత్త జిల్లాల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు.

అయితే ఏప్రిల్ 1 అమావాస్య రావడం.. రెండో తేదీన ఉగాది కార్యక్రమాల్లో బిజీ బిజీగా ఉండటం ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని దాన్ని ఏప్రిల్ 4కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే కొత్త జిల్లాల ఏర్పాటు విషయానికి సంబంధించి రాష్ట్ర కమిటీ, ప్రణాళిక శాఖ అధికారులు ఇచ్చిన నివేదికకు సీఎం వైఎస్ జగన్ ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లా ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 26 జిల్లాలకు కేబినెట్ వర్చువల్ విధానంలో ఆమోద ముద్ర వేసింది. 26 జిల్లాలో 70 రెవెన్యూ డివిజన్లు ఉండనున్నాయి.

ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, డీజీపీ కే వి రాజేంద్రనాథ్‌ రెడ్డి, సీసీఎల్‌ఏ స్పెషల్‌ సీఎస్‌ జి సాయి ప్రసాద్, జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, ప్లానింగ్‌ సెక్రటరీ జి విజయకుమార్, ఐటీ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, లా సెక్రటరీ వి సునీత ఇతర ఉన్నతాధికారులు హాజరు. ఇకపోతే అదే నెలలో ఏప్రిల్‌ 6న వలంటీర్ల సేవలకు సత్కారం, ఏప్రిల్‌ 8న వసతి దీవెన కార్యక్రమాలపైనా సీఎం వైఎస్ జగన్ సమీక్షించారు.

Advertisement

Next Story

Most Viewed