ఉక్రెయిన్‌పై తొలిసారి హైపర్‌సోనిక్‌ మిస్సైళ్ల ప్రయోగం.. ధ్వంసమైన ఆయుధాగారాలు

by Manoj |   ( Updated:2022-03-19 17:30:06.0  )
ఉక్రెయిన్‌పై తొలిసారి హైపర్‌సోనిక్‌ మిస్సైళ్ల ప్రయోగం.. ధ్వంసమైన ఆయుధాగారాలు
X

కీవ్/మాస్కో: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం రోజురోజుకూ తీవ్రమవుతోంది. రష్యా ఓ వైపు శాంతి చర్చలంటూనే మరోవైపు ఉక్రెయిన్‌పై భీకర దాడులకు పాల్పడుతోంది. అనుకున్న లక్ష్యం చేరడం ఆలస్యమవుతున్న తరుణంలో తన అమ్ముల పొదిలోంచి మరింత తీవ్రమైన ఆయుధాలను బయటకు తీస్తోంది. ఇందులో భాగంగానే 24వ రోజైన శనివారం.. ఉక్రెయిన్‌పై హైపర్‌సోనిక్ క్షిపణులతో దాడులకు తెగబడింది.

ఉక్రెయిన్‌కు పశ్చిమాన ఉన్న డెలియాటిన్ ప్రాంతంలోని ఆయుధ గారాలపై వీటిని ప్రయోగించింది. 'ఉక్రెయిన్‌లోని మందుగుండు సామగ్రి, క్షిపణులు కలిగి ఉన్న భూగర్భ గిడ్డంగిని కింజల్‌ హైపర్‌సోనిక్‌ క్షిపణులు నాశనం చేశాయ'ని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ దాడిలో పదుల సంఖ్యలో ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. కాగా, ఉక్రెయిన్‌పై దాడికి దిగినప్పటి నుంచి హైపర్‌సోనిక్ క్షిపణులను ప్రయోగించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ మిస్సైళ్లు ధ్వని కంటే 10రెట్లు ఎక్కువ వేగంతో ఎయిర్‌ డిఫెన్స్ వ్యవస్థలను అధిగమించి దూసుకెళ్లగల సామర్థ్యం గలవి.

కీవ్, జపోర్ఝియాపై అటాక్స్.. 15 మంది మృతి

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా సేనలు శనివారం మోర్టార్లతో దాడులకు పాల్పడ్డాయి. కీవ్‌లోని మకారివ్‌లో చేసిన ఈ దాడుల్లో ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు గాయపడ్డారని స్థానిక పోలీసు అధికారి వెల్లడించారు. మరో నగరం జపోర్ఝియాపైనా పెద్ద ఎత్తున దాడులు చేశాయి. జపోర్ఝియాపై శివారు ప్రాంతంపై చేసిన షెల్లింగ్‌, రాకెట్ దాడుల్లో 9మంది మృతిచెందగా, 17 మంది ఆస్పత్రిపాలయ్యారని డిప్యూటీ మేయర్ అనటోలియ్ కుర్టీవ్ వెల్లడించారు. దీంతో ఈ ప్రాంతంలో 38గంటల పాటు కర్ఫ్యూ విధించినట్టు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed