- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
తీరికలేని వ్యవసాయ శాఖ.. సేంద్రీయసాగుపై నిర్లక్ష్యం
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో సేంద్రీయ వ్యవసాయం సాగు కావడంలేదు. సాగును ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణను రూపొందించకపోవడం వలన కూడా రైతులు ఈ సాగు వైపు మళ్లడం లేదు. సంప్రదాయ పద్ధతిలో సాగు చేస్తున్న పంటలకు అన్నదాతలు అధిక రసాయనాలను వినియోగిస్తుండడంతో పంటలన్నీ విషపూరితం అవుతున్నాయి. దీంతో పాటు భూమి కూడా సారం కోల్పోతున్నది. ఈ నేపథ్యంలో రసాయనాల వినియోగాన్ని తగ్గించడం, భూములు సారం కోల్పోకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను సేంద్రీయ సాగు వైపు మళ్లించాలని నిర్ణయించాయి. కానీ అది నిర్ణయాలకే పరిమితమైంది. నానాటికీ రసాయనిక ఎరువులతో కూడిన సాగే పెరుగుతుండగా, సేంద్రీయ సాగు విస్తీర్ణం ఆశించిన మేర పెరగడంలేదు. ఈ సీజన్‌లో సేంద్రీయ సాగుకు సంబంధించి ప్రప్రోజల్స్‌ను పంపాలని వ్యవసాయ శాఖలోని ఆర్గానిక్ వింగ్ అధికారులు వ్యవసాయ విస్తరణ అధికారులను కోరారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రపోజల్స్ రాకపోవడం గమనార్హం.
కరువైన అవగాహన..
సేంద్రీయ సాగుకు సంబంధించి కొంతమంది యువతతో పాటు, ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్న వారిలో ఆసక్తి ఉన్నా.. అధికారుల నుంచి సరైన అవగాహన కొరవడడంతోనే సాగు విస్తీర్ణం పెరగడంలేదని తెలుస్తోంది. కాగా ఈ సాగు పెంపునకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులను విడుదల చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అమలుకు మాత్రం ఆటంకాలు ఏర్పడుతున్నాయి. సేంద్రీయ సాగుకు అవగాహన కరువవడంతో పాటు, మరోవైపు శ్రమ కూడా అధికంగా ఉండడంతో రైతులు ఈ సాగు వైపు ఆసక్తి కనబరచడం లేదు. కాగా దిగుబడులపై కూడా మిశ్రమ భావాలను వ్యక్తం చేస్తున్న రైతులు ఈ సాగు వైపు రావడానికి అయిష్టత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయిష్టత వ్యక్తం చేస్తున్న రైతులకు సరైన అవగాహన కల్పించి ఈ సేద్యం వైపు మళ్లించడానికి అధికారులు పూర్తి స్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
మొదటి దశకే పరిమితం
దేశ వ్యాప్తంగా సేంద్రీయ సాగును ప్రోత్సహించాలన్న కేంద్రం నిర్ణయం మేరకు తెలంగాణలోనూ ఈ సాగును పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకున్నా అవి.. మొదటి దశకే పరిమితమయ్యాయి తప్పితే విస్తీర్ణం మాత్రం పెరగడం లేదు. సేంద్రీయ సాగుకు సంబంధించి రాష్ట్రంలో 2017–18లో 19,500 ఎకరాల (390 హెక్టార్లు)లో సాగుకాగా, ఇది 2018–19 ఏడాదిలో పెరగక పోగా కేవలం 194 హెక్టార్ల (కేవలం 8,700 ఎకరాలు)లోనే సాగయింది. ఇక ఆ తరువాత నుంచి మళ్లీ ఇప్పటి వరకు అనుకున్న మేర సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం సాగు కాలేదు. మళ్లీ ఈ ఏడాదిలో సాగు చేయించేందుకు అధికారులు ప్రపోజల్స్ కోసం చూస్తున్నారు.
సాగుకు సాయమున్నా ఆటంకాలే...
సేంద్రీయ సాగు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యంతో 60:40 నిష్పత్తిలో నిధులను విడుదల చేస్తున్నా.. సాగు మాత్రం ముందుకు సాగకపోగా, ఆటంకాలు ఏర్పడుతున్నాయి. నేషనల్ మిషన్ ఫర్ సుస్టైన్ బుల్ అగ్రికల్చర్ పథకంలో పరాంపరాగత్ కృషి వికాస్ యోజన పథకం కింద కేంద్రం రాష్ట్రాలకు నిధులను మంజూరు చేస్తోంది. ఇందులో భాగంగా పథకం ప్రారంభమైన 2017 నుంచి 2020 వరకు సుమారు రూ.30కోట్లు తెలంగాణకు మంజూరు చేసినట్టుప్రాధమికంగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ సారి సాగుకు అందిస్తున్న సాయంతో పాటు క్లస్టర్ల విధానంలో కేంద్రం మార్పులు చేసింది. నూతన గైడ్ లైన్స్ ప్రకారం ఒక్కో క్లస్టర్ కు సుమారు 500 నుంచి 1000 హెక్టార్లు ఉండాలని సూచించగా, గతంలో ఒక్కో క్లస్టర్ లో 50ఎకరాలకు పైగా ఉన్నాయి. క్లస్టర్ తో పాటు దానికయ్యే ఖర్చులో తన వంతు వాటాగా ఒక్కో క్లస్టర్ కు రూ.52లక్షల వరకు ఇవ్వనున్నట్టు పేర్కొంది. గతంలో ఒక్కో క్లస్టర్ కు రూ.7లక్షలను కేంద్రం విడుదల చేసింది.
సాగు మారిన జిల్లాలు
సేంద్రీయ సాగు గతంలో ఎక్కువగా నల్గొండ, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో సాగవ్వగా, ఈసారి భూపాలపల్లి, ఖమ్మం, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఎక్కువ క్లస్టర్లు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సేంద్రీయ విధానంలో ప్రధానంగా వరి, కంది, మొక్కజొన్న పంటలతో పాటు కూరగాయలను ఎక్కువగా సాగు చేసేందుకు అవకాశం ఉంది. గతంలో సాగు చేసిన రైతులకు స్కీంలో భాగంగా రూ.5వేలు అందించగా, మార్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఈ సారి అందే సాయంలో మార్పులు జరగనున్నాయి. ఇప్పటికైనా అధికారులు సేంద్రీయ వ్యవసాయంపై రైతులకు సరైన అవగాహనను కల్పించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.