Komatireddy Venkat Reddy: 'తెలంగాణలో కాంగ్రెస్‌ను తీసుకురావడమే లక్ష్యం'

by Vinod kumar |   ( Updated:2022-04-15 14:08:22.0  )
Komatireddy Venkat Reddy: తెలంగాణలో కాంగ్రెస్‌ను తీసుకురావడమే లక్ష్యం
X

దిశ, మునుగోడు: తెలంగాణలో రైతు రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడమే లక్ష్యంగా సీనియర్ నాయకులతో కలిసి పనిచేస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలో జరిగిన వివాహా వేడుకలకు ఆయన హాజరై, అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన వడ్లను కొనడం చేతకాని సీఎం.. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కౌలు రైతులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. కౌలు రైతులకు రుణమాఫీ, రైతుబంధు, రైతు బీమా అందడం లేదన్నారు.

40 ఏండ్ల క్రితం ఇందిర హయాంలో దళితులకు ఇచ్చిన భూములను ఈ కేసీఆర్ ప్రభుత్వం లాక్కుంటుందంని ఆరోపించారు. కాళేశ్వరం అవసరం లేకున్నా రూ.లక్షా యాభై వేల కోట్ల అప్పులు తెచ్చి పనులు చేపట్టిందని, నక్కలగండి ఉదయ సముద్రం పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయకుండా, ఉదయ సముద్రం పై కేసీఆర్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది అన్నారు. ఈ ప్రాంత రైతుల పాపం సీఎంకు తగులుతుంది అన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఫిల్టర్ చేయని నీరు ప్రజలకు అందిస్తూ రూ.లక్షలు దుర్వినియోగం చేస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు.

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు.. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకునేందుకు సీనియర్ నాయకులను కలుపుకొని 32 జిల్లాలలో ఈనెల 18 తర్వాత పర్యటించనున్నట్లు తెలిపారు. రైతులకు ప్రభుత్వం మద్దతు ధర 1960 రూపాయలు చెల్లించాలన్నారు. రాష్ట్రంలోని రైతులు పండించిన ప్రతి వరి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. ఇప్పటివరకు తక్కువ ధరకు అమ్ముకున్న రైతులను గుర్తించి, వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చివరి గింజను కూడా రాష్ట్ర ప్రభుత్వమే కొనేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందన్నారు. ఈ సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, ఎంపీటీసీ భీమనపల్లి సైదులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story