కేసీఆర్‌లో కాక పుట్టిస్తోన్న 'ఆప్' నేత వ్యాఖ్యలు

by Nagaya |
కేసీఆర్‌లో కాక పుట్టిస్తోన్న ఆప్ నేత వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : మోడీని ఓడించాలనే లక్ష్యంతో ఏర్పడే ఫ్రంట్ విజయం సాధించదని ఆమ్ ఆద్మీ పార్టీ దక్షిణాది రాష్ట్రాల ఇన్‌చార్జి సోమ్‌నాధ్ భారతి అభిప్రాయపడ్డారు. ప్రజల సమస్యల పరిష్కారం లక్ష్యంతో కూటమి ఏర్పడితే తప్పక విజయం సాధిస్తుందన్నారు. అలాంటి కూటమి ఏర్పడితే అప్పుడు అందులో చేరడంపై పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించిన సందర్భంగా ఆదివారం రాత్రి మీడియాతో ఆయన చిట్‌చాట్ చేస్తూ పై వ్యాఖ్యలు చేశారు. కొన్ని పార్టీలు కులం, మతం ఆధారంగా రాజకీయాలు చేస్తున్నాయి తప్ప అభివృద్ధిపై దృష్టి పెట్టడంలేదన్నారు. కానీ ఢిల్లో 'ఆప్' మనుగడ పెద్దగా లేనప్పుడే అద్భుతాలు చేశామని, అభివృద్ధి పేరుతో సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తూ రాజకీయ పార్టీగా నిలదొక్కుకున్నామని, పంజాబ్‌లో సైతం ప్రజలు పట్టం కట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు.

రాజకీయ పార్టీ పనిచేయడం ఎలాగో కేజ్రీవాల్‌ను చూసి నేర్చుకోవాలన్నారు. మజ్లిస్ పార్టీ ముమ్మాటికీ బీజేపీకి 'బీ టీమ్' అని ఆయన వ్యాఖ్యానించారు. ముస్లింల ఓట్లను చీల్చుతూ బీజేపీకి మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ లాభం చేకూరుస్తున్నారని ఆరోపించారు. 'ఆప్' తదుపరి టార్గెట్ గుజరాత్, హిమాచల్‌‌ప్రదేశ్ అని అన్నారు. కశ్మీరీ పండిట్ల కోసం బీజేపీ చేసిందేమీ లేదని, ఆ అంశాన్ని రాజకీయాలకు వాడుకుంటూ ఉన్నదని అన్నారు. ఆ చిత్రం తీసిన నిర్మాతమకు డబ్బులు మాత్రమే కావాలన్నారు. నిజానికి కశ్మీరీ పండిట్ల అంశాన్ని విస్తృత ప్రజానీకంలోకి తీసుకెళ్ళాలంటే 'యూ ట్యూబ్' లాంటి సోషల్ మీడియాలో పెట్టాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ అవినీతే మా ప్రచారాస్త్రం

కేసీఆర్ అవినీతి గురించి తెలంగాణలో చిన్నపిల్లలను అడిగినా చెప్తారని సోమ్‌నాధ్ భారతి వ్యాఖ్యానించారు. అవినీతి రహిత పాలన అందించడమే తమ పార్టీ లక్ష్యమన్నారు. పంజాబ్‌లో కేజ్రీవాల్ పేరు తుపాన్‌లా పనిచేసిందని, ఢిల్లీలో ఆయన నేతృత్వంలో సాధించిన రోల్ మోడల్ గవర్నెన్స్ నినాదంతో ఎన్నికలకు వెళ్తామన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరలేదని, ఇదే విషయాన్ని రాష్ట్రంలోని ప్రతీ గడపకు వెళ్ళి వివరిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో సుమారు 1.92 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే తెలంగాణ సర్కారు భర్తీ చేయడం లేదని ఆరోపించారు.

ఢిల్లీలో తమ ప్రభుత్వం 12 లక్షల ఉద్యోగాలను కల్పించిందన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలంటూ బీజేపీ భారీ హామీ ఇచ్చినా వాటిని ప్రధాని భర్తీ చేయలేదన్నారు. తెలంగాణలోనూ కొన్ని పార్టీలు కులం, మతం పేరుతో రాజకీయాలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయన్నారు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం కుల మత రాజకీయాలకు పాల్పడదని, వాటికోసమే అయితే తెలంగాణలో పార్టీని విస్తరింపజేయాల్సిన అవసరం కూడా ఉండదన్నారు. ఇచ్చిన ప్రతీ వాగ్దానాన్ని కేజ్రీవాల్ అమలు చేశారని, తెలంగాణలో మాత్రం వాస్తవం అందుకు పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. ఏప్రిల్ 14న పాదయాత్ర చేపడతామని, కేజ్రీవాల్ మోడల్ గవర్నెన్స్ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ఢిల్లీలో 10 లక్షల మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజలున్నారని, ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం చెప్పిందేంటో, అమలు చేసిందేంటో వారికి స్వీయానుభవమని గుర్తుచేశారు.

Advertisement

Next Story

Most Viewed