వారిపై చర్యలు తీసుకోవాలి.. ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు..

by Vinod kumar |
వారిపై చర్యలు తీసుకోవాలి.. ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు..
X

దిశ, సంగారెడ్డి: గ్రామ పంచాయతీ నిధులను దుర్వినియోగం చేశారని కాశీపూర్ గ్రామ వార్డు మెంబర్ మాల సంజీవ్ హైకోర్టులో వేసిన పిటీషన్ ను పరిశీలించిన ధర్మాసనం నిధుల దుర్వినియోగం నిజమని తేలడంతో సర్పంచ్ ఫరీదా బేగం, ఉప సర్పంచ్ టి. నాగరాజు, పంచాయతీ సెక్రెటరీ ఎన్. పద్మ లపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది.


సంగారెడ్డి జిల్లా, కంది మండలం, కాశీపురం గ్రామ పంచాయతీ నిధులను సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ లు కలిసి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని గ్రామ వార్డు మెంబర్ మాల సంజీవ్ హైకోర్టులో వేసిన పిటిషన్ ను స్వీకరించిన ధర్మాసనం నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టేందుకు కలెక్టర్ ను ఆదేశించింది. దానిపై విచారణ చేసి నివేధికను అందించాలని, విచారణ అధికారిగా డిఎల్పీఓ సతీష్ రెడ్డి ని నియమించి విచారణ రిపోర్ట్ ను హైకోర్టుకు అందించారు.


విచారణ చేపట్టిన అధికారి గ్రామ పంచాయతీ నిధులు సుమారు రూ. 20 లక్షలకు పైగా దుర్వినియోగం చేశారని కోర్టుకు సమర్పించిన నివేదికలో పొందుపరిచారు. దీనిని పరిశీలించిన న్యాయమూర్తి అభిషేక్ రెడ్డి నిధుల దుర్వినియోగానికి పాల్పడిన సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ కార్యదర్శి పై ఎనిమిది వారాల్లో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు న్యాయమూర్తి ఆదేశించారు.

Advertisement

Next Story