TDP : తెలంగాణపై టీడీపీ ఫోకస్.. పూర్వ వైభవమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహం!

by GSrikanth |
TDP : తెలంగాణపై టీడీపీ ఫోకస్.. పూర్వ వైభవమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో పూర్వ వైభవం చాటేందుకు టీడీపీ ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ వైఫల్యాలు, గత టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి వెళ్లి వివరించేందుకు ప్రణాళికలు రూపొందించింది. పార్టీ సభ్యత్వం, ఇన్ చార్జుల నియామకం, రివ్యూలు చేపట్టనున్నారు. రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలో ఎంత ఓటింగ్ శాతం ఉంది... పార్టీని వీడినవారితో పాటు ఇతర పార్టీల వారిని సైతం ఆహ్వానించడంతో పాటు రాబోయే ఎన్నికల్లో పోటీ చేసి సత్తాచాటేందుకు సన్నద్ధమవుతోంది. వారం వారం పార్టీ చేపట్టిన కార్యక్రమాలపై రివ్యూలు చేయనున్నారు. ఇప్పటికే పార్టీ బలోపేతానికి త్రిమెన్ కమిటీని ప్రకటించిన అధిష్టానం త్వరలోనే మరో కమిటీని ప్రకటించనున్నట్లు సమాచారం.

రాష్ట్రంలో గ్రామస్థాయిలో టీడీపీ బలంగా ఉంది. నాయకత్వ లోపంతో కొట్టమిట్టాడుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోవడంతో ఆంధ్రాకే చంద్రబాబు పరిమితం అయ్యారు. తెలంగాణలో పటిష్టమైన అధ్యక్షుడు లేకపోవడంతో పార్టీకి తీవ్ర నష్టం జరిగింది. పార్టీకి గ్రామస్థాయిలో కార్యకర్తలు ఉండటంతో నాయకత్వ లోపానికి చెక్ పెట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు అధ్యక్షులను నియమించడంతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని నియమించినా ఆశించిన స్థాయిలో ఫలితం రాకపోవడం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిలుర్స్‌ను ఎండగట్టడంలో నేతలు విఫలమవుతున్నారు. ఇది గమనించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు రంగంలోకి దిగారు. పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేయాలని, బలోపేతం దిశగా అడుగులు వేసేలా కార్యచరణ ప్రకటించారు. అందులో భాగంగానే ఈ నెల 25 నుంచి గ్రామగ్రామాన సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఆన్‌లైన్లో సభ్యత్వం, డిజిటల్ కార్డు ఫోన్ కే చేరేలా క్యూ ఆర్ కోడ్‌తో ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఇన్ చార్జులను నియమించనున్నారు. అందులో భాగంగా 20 నియోజకవర్గాలకు ఇన్ చార్జులను పార్టీ అధినేత ప్రకటించారు. మిగతా వారిని త్వరలోనే ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ చరిత్ర సృష్టించింది. 1982 మార్చి 29న ఎన్టీఆర్ పార్టీని స్థాపించగా కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చింది. 1983లో 7వ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో 294 స్థానాలకు గాను 202 స్థానాల్లో విజయం సాధించి టీడీపీ అధికారంలో వచ్చింది. 1984లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ 202 స్థానాలను కైవసం చేసుకుంది. తిరిగి 1994లో జరిగిన ఎన్నికల్లో 216 స్థానాలు, 1999 లో జరిగిన ఎన్నికల్లో 180 స్థానాల్లో విజయం సాధించింది. అధికారం చేజిక్కించుకుంది. 2004, 2009లో టీడీపీ ఓటమిపాలైంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు పరిమితం అయ్యారు. తెలంగాణలో నాయకత్వ లోపంతో 119 స్థానాల్లో కేవలం 15 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఓట్లశాతం 21.77 ఉంది. అదే విధంగా 2018 ఎన్నికల్లో 119 స్థానాలకు గాను 2 స్థానాల్లో విజయం సాధించగా 2.75 శాతానికి పడిపోయింది. ఇందుకు గల కారణాలను విశ్లేషించేందుకు నియమించిన కమిటీ క్షేత్రస్థాయిలో వివరాలను సేకరిస్తుంది. వివరాల ఆధారంగా ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలని నిర్ణయించనున్నట్లు సమాచారం. తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లోని పదింటిలో పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. ఖమ్మం, నల్లగొండ, సికింద్రాబాద్, భువనగిరి ఇలా మరికొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెంగ్మెంట్లలో పోటీ చేయాలని అధినేత పార్టీ శ్రేణులకు సూచించినట్లు సమాచారం. కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, మలక్ పేట, కొత్తగూడం, ఖమ్మం, వైరా, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాలను ప్రముఖంగా ఆరా తీసినట్లు తెలిసింది. టీడీపీ పాలనలో చేసిన అభివృద్ధేనని, టీఆర్ఎస్ పాలనలో చేసింది శూన్యమనే విషయాన్ని సైతం ప్రజలకు వివరించేలా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ముందుకు సాగనున్నారు.

త్రిమెన్ కమిటీ..

రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలకు త్రిమెన్ కమిటీని పార్టీ అధినేత ప్రకటించారు. నిర్మల్, ఆదిలాబాద్, జహీరాబాద్, జగిత్యాల, బోధన్, బాల్కొండ త్రిమెన్ కమిటీని ప్రకటించారు. నిజామాబాద్ అర్బన్‌కు మాత్రం టుమెన్ కమిటీని ప్రకటించగా, 20 నియోజకవర్గాలకు నియోజకవర్గ ఇన్ చార్జులను నియమించారు. వీరంతా పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేయనున్నారు. వారం వారం పార్టీ చేపట్టిన కార్యక్రమాలను రివ్యూ చేసేందుకు సమావేశం నిర్వహించనున్నారు. చేయబోయే కార్యక్రమాలను సైతం సమీక్షించనున్నారు. అదే విధంగా పార్టీ బలోపేతానికి మరో కమిటీని నియమించనున్నట్లు సమాచారం. టీడీపీ శ్రేణులను ఎప్పటికప్పుడు సన్నద్ధం చేయడంతో పాటు ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించాలన్నారు. పార్టీబలోపేతమే లక్ష్యంగా ప్రతి నాయకుడు పనిచేయనున్నారు.

త్వరలో మినీ మహానాడు

తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టిసారించిన చంద్రబాబు.. త్వరలోనే మినీ మహానాడు ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. అందుకు సంబంధించిన తేదీని సైతం ప్రకటించే అవకాశం ఉందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలు, బలోపేతానికి ప్రత్యేక టీంను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. మహానాడుతో రాష్ట్రంలోని పార్టీనేతలందరినీ ఒకే వేదికపైకి తెచ్చి పునర్ వైభవం తెచ్చేందుకు చంద్రబాబు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి సత్తాచాటేందుకు యత్నాలను ముమ్మరం చేశారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. ఎప్పటి నుంచి ప్రజల వద్దకు వెళ్లాలనే దానిపై స్పష్టత రానుంది.

Advertisement

Next Story

Most Viewed