- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మునుగోడు ఉపఎన్నికపై సస్పెన్స్.. ముందస్తు ఎన్నికలపై ఉత్కంఠ
దిశ, తెలంగాణ బ్యూరో: నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ స్పీకర్‌కు నిర్దిష్ట ఫార్మాట్‌లో రిజిగ్నేషన్ లెటర్‌ను సోమవారం అందజేస్తానని ప్రకటించారు. ఒకవేళ స్పీకర్ అందుబాటులో లేకుంటే అసెంబ్లీ సెక్రటరీకి సమర్పిస్తానని క్లారిటీ ఇచ్చారు. ఈ రిజిగ్నేషన్‌ను నిర్దిష్ట ఫార్మాట్‌లో ఇస్తున్నా స్పీకర్ ఇందుకు ఆమోదం తెలుపుతారా? లేదా? అనే సందేహం ఆయన్ను వెంటాడుతున్నది. ఆమోదించే వరకు ఇంటి ముందు కూర్చుని నిరసన తెలియజేస్తానని కూడా స్పష్టం చేశారు. ఇలాంటి అనుమానం నేపథ్యంలోనే మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఉప ఎన్నిక వస్తుందా? రాదా? అనే చర్చలు జరుగుతున్నాయి. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రిజిగ్నేషన్ లెటర్‌ను సమర్పించిన గంటల వ్యవధిలోనే స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. కానీ రాజగోపాల్‌రెడ్డి విషయంలో ఏం జరుగుతుందోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాజీనామాపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోకపోవచ్చునని, కొంతకాలం పెండింగ్‌లో పెట్టవచ్చని, ఇందుకు రకరకాల కారణాలను తెరపైకి తీసుకురావచ్చన్న చర్చలు జరుగుతున్నాయి. స్పీకర్ తనకున్న విచక్షణాధికారం మేరకు వ్యవహరిస్తారు. గతంలో తలసాని శ్రీనివాసయాదవ్ రాజీనామా విషయంలోనూ తీవ్ర స్థాయిలోనే చర్చలు జరిగాయి. ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యే రిజిగ్నేషన్ విషయంలో ఎలా వ్యవహరిస్తారన్నది కీలకంగా మారింది. ఈ నిర్ణయానికి అనుగుణంగానే ఉప ఎన్నిక వస్తుందో? రాదో? తేలిపోతుంది.
కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఇప్పటికే రాజీనామా చేసి బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించిన రాజగోపాల్‌రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని కూడా వదులుకోనున్నట్లు స్పష్టం చేశారు. ఒకవేళ స్పీకర్ తన రాజీనామాను ఆమోదించకపోతే ఆయన ఇంటి ముందు కూర్చుని నిరసన తెలియజేస్తానంటూ ప్రకటించారు. స్పీకర్ ఆమోదంపై రాజగోపాల్‌రెడ్డికి అనుమానం ఎందుకొచ్చిందనేది చర్చకు దారితీసింది. స్పీకర్ ఆమోదించేందుకు వీలుగా నిర్దిష్ట ఫార్మాట్‌లోనే సమర్పిస్తారా లేక రాజీనామాకు ఆమోదం రావద్దనే స్వయంగా ఆయనే కోరుకుంటున్నారా అనే చర్చలూ జరుగుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికకు టీఆర్ఎస్ సంసిద్ధంగా ఉన్నట్లయితే స్పీకర్ ఆమోదం తెలపవచ్చని లేనిపక్షంలో పెండింగ్‌లో ఉండిపోవచ్చన్న అభిప్రాయాలు మూడు ప్రధాన పార్టీల నేతల నుంచి వ్యక్తమవుతున్నాయి.రాజగోపాల్‌రెడ్డి రాజీనామా పత్రాన్ని ఇంకా స్పీకర్‌కు సమర్పించకముందే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలలో వేడి మొదలైంది. మూడు పార్టీలూ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం కావడంతో ఇప్పటికే బలప్రదర్శనకు దీటుగా చండూరులో భారీ బహిరంగసభను నిర్వహించింది. బీజేపీ ఈ నెల 21న అంతకంటే భారీ స్థాయిలో నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నది. ఈ రెండు పార్టీలనూ తలదన్నే తీరులో టీఆర్ఎస్ సైతం ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే భారీ మీటింగ్ పెట్టాలనే ఆలోచన చేస్తున్నది. పార్టీల ఆలోచనలు ఇలా ఉంటే తన రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తారా? లేదా? అనే అనుమానం స్వయంగా రాజగోపాల్‌రెడ్డికే రావడం సరికొత్త చర్చకు ఆస్కారమిచ్చింది.
కరోనా వ్యాప్తితో ఉప ఎన్నికపై సస్పెన్స్
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయంటూ కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ ప్రత్యేకంగా తెలంగాణకు శనివారం లేఖ రాసింది. రోజువారీ కేసులతో పాటు వీక్లీ యావరేజ్‌లో కూడా కొత్త కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, కట్టడి చర్యలపై దృష్టి పెట్టాలని సూచించింది. గత వారంలో క్రమంగా పాజిటివ్ కేసులు పెరుగుతూ వెయ్యి దాటిన నేపథ్యంలో అప్రమత్తం చేసింది. ఇలాంటి తరుణంలో మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక జరిగితే దాదాపు మూడు నెలల పాటు పార్టీల క్యాంపెయిన్, భారీ సంఖ్యలో జనం హాజరయ్యే మీటింగులు, సోషల్ డిస్టెన్స్ అమలు ప్రశ్నార్థకంగా మారడం.. ఇవన్నీ కేసులు మరింత పెరగడానికి, వైరస్ వ్యాప్తి చెందడానికి దారితీస్తుంది. ఉప ఎన్నిక చర్చ జరుగుతున్న సమయంలో కరోనా వ్యాప్తిపై కేంద్రం లేఖ రాయడం గమనించాల్సిన అంశం. కేసులు సాధారణ స్థాయికి తగ్గేంతవరకు, వైరస్ వ్యాప్తి నియంత్రణలోకి వచ్చేంతవరకు ఉప ఎన్నిక విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎలా ఆలోచిస్తుందనేది కూడా గమనార్హం. కేంద్ర వైద్యారోగ్య శాఖ నుంచి సూచనలు, సిఫారసులు తీసుకున్న తర్వాతనే ఎన్నికల సంఘం ఉప ఎన్నికపై స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకుంటుందనే చర్చలూ జరుగుతున్నాయి.
మునుగోడుకేనా.. రాష్ట్రం మొత్తానికా?
రాజగోపాల్‌రెడ్డి రాజీనామాపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అధికార పార్టీ ఆలోచనకు అనుగుణంగా నిర్ణయం ఉండొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఉప ఎన్నికకు టీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నట్లయితే వెంటనే స్పీకర్ నుంచి ఆమోదం రావచ్చని, లేనిపక్షంలో పెండింగ్‌లో పడొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ జరిగే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలవాలని కోరుకున్నా, గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నా వెంటనే స్పీకర్ నుంచి సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కానీ గెలుపుపై అనుమానాలు ఉన్నట్లయితే ఆ ప్రభావం రానున్న అసెంబ్లీ ఎన్నికలపై పడొచ్చనే అభిప్రాయంతో ఉంటే ఇప్పుడు స్పీకర్ వెంటనే ఆమోదం తెలపకపోవచ్చనే వార్తలూ వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం మునుగోడుకు మాత్రమే ఉప ఎన్నిక వస్తుందా లేక ముందస్తుగా అసెంబ్లీని రద్దు చేసి ఒకేసారి రాష్ట్రమంతా నిర్వహించాలనే దిశగా టీఆర్ఎస్ ఆలోచన చేస్తుందా? అనే చర్చలు కూడా ఉధృతంగానే జరుగుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి సమర్పించే రాజీనామా నిర్దిష్ట 'స్పీకర్ ఫార్మాట్'లో ఉందా? లేదా? అనేది ఒక ప్రధాన అంశమైతే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మరో ముఖ్యమైన అంశంగా మారింది. పోటీ కోసం మూడు ప్రధాన పార్టీలతో పాటు బీఎస్పీ, వైఎస్సార్టీపీ లాంటివి సిద్ధమవుతున్నా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే కన్‌ప్యూజన్ కూడా కంటిన్యూ అవుతున్నది.